బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (19:24 IST)

టెస్లా కంపెనీని చంద్రబాబు ఒప్పిస్తే... జగన్ రెడ్డి తరిమికొట్టారు...

రాష్ట్రానికి దిగ్గజ కంపెనీల రాక, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి అని, రూ.96,400కోట్ల మేర 4 బడా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని అవినీతి పుత్రిక సాక్షిలో తప్పుడు రాతలు రాసారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.  
మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
 
 
జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారానికి క్యాసినోలపై ఉన్న శ్రద్ధ, కంపెనీలు,  పెట్టుబడుల ఆకర్షణపై లేకపోవడం వల్ల రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రంగా నష్టపోతోందన్నారు. జగనన్న ప్రభుత్వ పనీతీరు చూసి ఓఎన్ జీసీవారు రూ.78వేలకోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారా? అని అయన ప్రశ్నించారు. రూ.78వేలకోట్ల పెట్టుబడులకు సంబంధించి, ఆనాటి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపెట్రోలియం, సహజవాయువుల శాఖామంత్రి ధర్మేంధ్రప్రదాన్, ఓఎన్ జీసీ సీఎండీ దినేశ్ షరాఫ్  సమక్షంలో  ఒప్పందం జరిగిందని చెప్పారు. 
 
 
గతంలో చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనలో  స్వయంగా టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్ ని  రాష్ట్రంలో పెట్టుబడికి ఒప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే టెస్లా కంపెనీ వారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి భయభ్రాంతులై  ఏపీ తప్ప మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు అని విమర్శించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ  మంత్రి కేటీఆర్ ఎలాన్ మస్క్ కి స్వయంగా సందేశం పంపి వారి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని  ఆహ్వనించారు. అలానే పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు టెస్లాకంపెనీకోసం నేడు మూకుమ్మడిగా పోటీపడుతున్నాయి. మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ కూడా, తమరాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని టెస్లా కంపెనీ సీఈవోకి సందేశం పంపారు.  పశ్చిమ బెంగాల్ తరుపున మహ్మద్ గులామ్ రబ్బానీ కూడా టెస్లా కంపెనీకి స్వాగతంపలికారు. ఈ జాబితాలో ఏపీ ఎక్కడుంది? అని ప్రశ్నించారు.