శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (13:33 IST)

విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్న పాత్రుడు అరెస్టు

ayyanna patrudu
విజయవాడ గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పోలీసులను తిట్టారంటూ ఆరోపిస్తూ టీడీపీ నేత చింతకాలయ అయ్యన్నపాత్రుడిని పోలీసులు విశాఖ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అయ్యన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. 
 
ఆయన శుక్రవారం ఉదయం 10.05 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖకు ఎయిర్ ఏషియా విమానంలో చేరుకున్నారు. పావు గంట తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనను బలవంతంగా పోలీసులు కారులో ఎక్కించుకుని వెళ్ళారు. అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయడాన్ని టీడీపీ శ్రేణులు బలవంతంగా ఖండిస్తున్నారు.
 
వైకాపా నేతల బూతులు పోలీసులకు ప్రవచనాలా?
 
పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టును టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. "అరెస్టులతో మా గొంతు నొక్కలేవు జగన్. నీ అణిచివేతే మా తిరుగుబాటు. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ సైకో పాలనకి పరాకాష్ట. అయ్యన్న వ్యాఖ్యలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సిఎంగా ఉండి జగన్, వైసిపి నేతల వ్యాఖ్యలను ఏమి అనాలి? వైసిపి నాయకులు, మంత్రుల బూతులు పోలీసులకు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? రాజారెడ్డి రాజ్యాంగంలో అధికార పార్టీ నాయకులకు ప్రత్యేక హక్కులు కల్పించారా? ప్రజల గళాన్ని వినిపిస్తున్న అయ్యన్న అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను" అంటూ ఆయన పేర్కొన్నారు.