ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (20:22 IST)

డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అరెస్టు

si rajender
స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొంత మేరకు దాచిపెట్టి.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నించి ఓ ఎస్‌ఐను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో రాజేందర్ అనే వ్యక్తి ఎస్ఐగా పని చేస్తున్నాడు. ఈయన స్మగ్లర్ల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1750 గ్రాముల వరకు దాచిపెట్టి రహస్యంగా విక్రయించేందుకు ప్రయత్నించాడు. 
 
దీనిపై నగరంలోని నార్కోటిక్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
 
రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నారు.