శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (10:18 IST)

తెలుగు చిత్రపరిశ్రమకు అల్లు అర్జున్ గర్వకారణం : సీఎం కేసీఆర్

kcrao
తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన ఆణిముత్యం అల్లు అర్జున్ అని, ఆయన తెలుగు చిత్రపరిశ్రమకే గర్వకారణం అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ అవార్డులను దక్కించుకున్న టాలీవుడ్ నటులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. 
 
హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు చలనచిత్రరంగం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రతిభ చూపించడం గర్వకారణమన్నారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
 
'69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం గొప్ప విషయం. అల్లు రామలింగయ్య వారసుడిగా, అగ్రనటుడు చిరంజీవి స్ఫూర్తితో అల్లు అర్జున్‌ సొంతంగా ఎదిగారు. విలక్షణ నటనతో తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించారు. జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా మన చిత్రరంగానికి గర్వకారణంగా నిలిచారన్నారు. 
 
సృజనాత్మక రచనతో సినీ సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు జాతీయ అవార్డు దక్కడం పట్ల ఆయనకు అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్‌క్రిటిక్‌ పురుషోత్తమాచార్యులతో పాటు అవార్డులు పొందిన సినిమాల్లో పనిచేసిన సిబ్బందికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా' అని సీఎం కేసీఆర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.