ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (16:42 IST)

మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా.. చానళ్ళపై పరువు నష్టం దావా : అషు రెడ్డి

ashu reddy
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసులో పలువురు సినీ సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు "కబాలీ" చిత్ర నిర్మాత కేపీ చౌదరికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్ల కాల్ లిస్టులో అనేక మంది హీరో హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా లీక్ కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా హీరోయిన్ అషు రెడ్డి, మరో నటి సురేఖ వాణీ పేర్లు ఉన్నట్టు సమాచారం. దీంతో వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి, ఈ డ్రగ్స్ దందాతో తమకెలాంటి సంబంధం లేదని నెత్తిన నోరు బాదుకుని చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో అషు రెడ్డి మరోమారు తాజాగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ గత రెండు రోజులుగా పలు రకాలైన న్యూస్ చానెల్స్‌లో తన పేరును, ఫోన్ నంబరును కూడా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేపీ చౌదరితో తాను వందల కాల్స్ మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాలో వస్తున్న వార్తా కథనాలతో గత రెండు రోజులుగా మెంటల్ టార్చర్‌ను అనుభవిస్తున్నట్టు చెప్పారు. 
 
తనకు ఈ కేసుతో సంబంధం లేకపోయినా తన గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని అషురెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్‌ను వేయడంతో తనకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో విధిలేని పరిస్థితుల్లో ఫోన్ స్విచాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తనను కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేసే మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని అషు రెడ్డి హెచ్చరించారు. తనకు కూడా కెరియర్, కుటుంబం ఉందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికింది.