బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:17 IST)

వైఎస్.వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు

viveka deadbody
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో పులివెందుల కోర్టు మంజూరుచేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పైగా, వచ్చే నెల ఐదో తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. గంగిరెడ్డి బయట స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సీబీఐ హైకోర్టుకు తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, అందువల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి బయటవుంటే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. 
 
కాగా, వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ ప్రభుత్వం తొలుత ప్రత్యేక దర్యాప్తు సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించిన విషయం తెల్సిందే. ఈ కేసులో 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. నిబంధనల ప్రకారం నిందితులపై 90 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సివుంది. లేనిపక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27వ తేదీన గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.