శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వివేకా హత్య రోజున రాత్రంతా ఫోన్ వాడిన అవినాశ్ రెడ్డి : కోర్టుకు తెలిపిన సీబీఐ

avinash reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరో సంచలన విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. వివేక హత్య జరిగిన రోజు రాత్రంతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్‌ను అసాధారణ రీతిలో వినియోగించారని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అందువల్ల అవినాశ్ రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కుట్ర అతడికి ముందే తెలుసని స్పష్టం చేసింది.
 
వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అవినాశ్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత నాలుగు విచారణల్లో అవినాష్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. 
 
వివేకా హత్య కుట్ర అవినాష్ రెడ్డికి తెలుసని చెప్పారు. హత్యకు ముందు, హత్య తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారని వివరించింది. సునీల్, ఉదయ్, జయప్రకాశ్ రెడ్డితో అవినాష్‌కు ఉన్న సంబంధాలు తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ హైకోర్టుకు విన్నవించింది. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాని పేర్కొంది. 
 
హత్య జరిగిన రోజున అవినాష్ జమ్మలమడుగు సమీపంలోనే ఉన్నట్టు చెప్పారని, కానీ ఆ సమయంలో అవినాష్ ఇంట్లోనే ఉన్నట్టు అతడి మొబైల్ సిగ్నల్స్ ద్వారా తేలిందన్నారు. హత్య రోజు రాత్రంతా అవినాష్ ఫోన్‌ను అసాధారణంగా వాడినట్టు గుర్తించామని తెలిపింది. కాగా, ఈ కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరపున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు.