శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (20:44 IST)

వివేకా హత్య కేసు : తండ్రీతనయుల అరెస్టు తప్పదా?

ys avinash - ys viveka
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ భాస్కర్ రెడ్డిల అరెస్టు ఖాయమని తెలుస్తుంది. అవినాశ్ రెడ్డి అరెస్టును ఆపలేమని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దీంతో అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను సీబీఐ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 
 
అదేసమయంలో అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనకు గురైనట్టు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఆయన నివాసంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. అక్కడ సీఎం జగన్‌తో అవినాశ్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. అవినాశ్‌ రెడ్డి తనతో భేటీ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీతో పార్లమెంట్‌లో జగన్ భేటీ కావడం గమనార్హం. 
 
ముఖ్యంగా, ఏపీలో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాలను గైర్హాజరైన సీఎం జగన్.. ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతోనే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వివేకా హత్య కేసులో తన తమ్ముడు అవినాశ్ రెడ్డితి కాపాడుకునేందుకే సీఎం జగన్ జగన్ ఢిల్లీకి వెళ్లారంటూ విపక్ష నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇదే అంశం సోషల్ మీడియాలో ట్రెడింగ్ అయింది.