ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (15:16 IST)

14న టెట్ నోటిఫికేషన్ విడుదల... నారాయణ జూనియర్ కాలేజీపై విచారణకు ఆదేశం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీ విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ ల

* టెట్ పాసైనవారు ఏడేళ్ల వరకు అర్హులు
* దరఖాకాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 1
* పరీక్షలు జనవరి 17 నుంచి 27 వరకు
* ఫిబ్రవరి 8న ఫలితాల ప్రకటన
* పేపర్ 1కు డీఎడ్ వారు మాత్రమే అర్హులు
* పేపర్ 2కు బీఈడీ వారు అర్హులు
* పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచన
* 16 నుంచి విశాఖలో టెక్ కాన్ఫరెన్స్
* మరో విద్యార్థి ఆత్మహత్య బాధాకరం
* నారాయణ జూనియర్ కాలేజీపై విచారణకు ఆదేశం
* కాలేజీలపై రూ.50 లక్షల పెనాల్టీ విధింపు
 
అమరావతి : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ ఈ నెల 14వ తేదీ విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి టెట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. టెట్ ఫీజు చెల్లించడానికి గడువు ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకని తెలిపారు. ఆన్ లైన్ (సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్) ద్వారా ఈ నెల 18 నుంచి జనవరి 2018 వరకు దరకాస్తు చేసుకోవచ్చని, 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పనివేళల్లో హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఈ నెల 19 నుంచి 30 వరకు స్వీకరిస్తారని చెప్పారు. జనవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుందన్నారు. 9 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చిని తెలిపారు.
 
ఈ పరీక్షలు జనవరి 17 నుంచి 27 వరకు జరుగుతాయని, రెండు పేపర్లు ఉంటాయని తెలిపారు. ఒక పేపర్ 1 నుంచి 5వ తరగతి వరకేనని, వాటికి డీఎడ్ వారు మాత్రమే అర్హులని, మరో పేపర్ 6 నుంచి 10వ తరగతి వరకు అని వాటికి బీఈడీ వారు అర్హులని వివరించారు. పేపర్ 1కు ఇంటర్లో 50 శాతం మార్కులు పొందినవారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు పొంది ఉంటే సరిపోతుందని తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని మంత్రి వివరించారు. జనవరి 29న కీ విడుదల చేస్తామని చెప్పారు. కీ పైన అభ్యంతరాలను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు తెలుపవచ్చన్నారు. ఫిబ్రవరి 6న ఫైలన్ కీ విడుదల చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 8న ఫైనల్ ఫలితాలు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. ఒకసారి టెట్ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచన
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యత పోటీ పరీక్షల నిర్వహణలో దీర్ఘకాల అనుభవం కలిగిన ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. గతంలో వీటిని ఎటువంటి అవకతవకలు లేకుండా డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా భర్తీ చేశారని చెప్పారు. అయితే ఎపీపీఎస్సీకి వృత్తిపరమైన నిపుణులు అందుబాటులో ఉంటారని, అలాగే వారికి అనుభవం కూడా ఎక్కువేనని అందువల్ల వారికి అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జూన్ నాటికి పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నందున, సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసి ఉందని, అందువల్ల ఏపీపీఎస్సీ చైర్మన్‌ని రమ్మనమని చెప్పామని, ఆయనతోనూ, సీఎం గారితోనూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2014 డీఎస్సీకి 10,313 పోస్టులు ప్రకటించినట్లు తెలిపారు. అప్పుడు 4,20,702 మంది దరఖాస్తు చేసుకోగా, 3,96,366 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఈ సారి 4 లక్షలకు పైగా హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది హాజరైనా పారదర్శికంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 
 
మరో విద్యార్థి ఆత్మహత్య బాధాకరం
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. తిరుపతి నారాయణ జూనియర్ కాలేజీలో బి.కొత్తకోటకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు. ఆ కాలేజీపై రూ.50 లక్షల రూపాయల పెనాల్టీ విధించినట్లు తెలిపారు. గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు సంబంధించి నారాయణ, శ్రీచైతన్య, సీవిరామన్ వంటి కాలేజీలపై పెనాల్టీ విధించినట్లు చెప్పారు. అయితే ఆ పెనాల్టీ చెల్లించలేదని తెలిసిందని, అటువంటి కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. 
 
పెనాల్టీ ద్వారా వసూలు చేసే సొమ్ములో కొంత భాగాన్ని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి చెల్లించే అంశం పరిశీలిస్తామని చెప్పారు. కాలేజీలు విద్యార్థుల చదువులకు, ఆటలకు కేటాయించే సమయాలు నిబంధనల ప్రకారం ఉన్నవో లేవో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి గ్రేడింగ్ ద్వారా మార్కులు తెలియజేస్తామని మంత్రి గంటా చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.