గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (19:15 IST)

పేదల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా 30 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్ధలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటిని నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేసింది.

ఈ క్రమంలో భాగంగా 17,000 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలలో పక్కా ఇళ్ళను నిర్మించనున్నారు. ఈ ఇళ్ళకు సంబంధించి ఏపీ హౌజింగ్‌ కార్పొరేషన్‌ మోడల్‌ హౌస్‌ను రూపొందించింది. తాడేపల్లిలో నిర్మించిన ఈ మోడల్‌ హౌస్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. 
 
పేదలకు నిర్మించే ఈ ఇళ్ళు మంచి నాణ్యతతో, సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. లివింగ్‌ రూమ్, ఒక బెడ్‌రూమ్, కిచెన్, బాత్రూమ్, బయట వరండాతో మోడల్‌ హౌస్‌ను రూపొందించారు. మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో మరో 15 లక్షలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హౌజింగ్‌ శాఖ అధికారులు తెలిపారు
 
ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, మంత్రులు కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.