శ్రీశైలం డ్యామ్ కు పొంచిఉన్న ముప్పు
పులిచింతల రిజర్వాయర్ వినియోగంలోకి వచ్చి మూడేళ్లు కాకముందే డ్యామ్ గేట్ ఊడిపోవడంతో రాష్ట్రంలో మిగిలిన రిజర్వాయర్ల భద్రతపై కూడా చర్చ జరుగుతోంది. రెండు తెలుగురాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు ఫ్లంజ్‌పూల్ (గేట్ల నుండి నీరు పడే ప్రాంతం) రూపంలో ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్లంజ్ పూల్వద్ద ఏర్పడ్డ గుంతలకు మరమ్మత్తులు చేయకపోతే డ్యామ్ భద్రతకే ముప్పు వస్తుందని కొన్ని సంవత్సరాల నుండి ఆందోళన వ్యక్తమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. డ్యామ్ 6,7,8 గేట్లముందు ప్లంజ్‌పూల్‌లో ఏర్పడ్డ గుంతలు ఇపుడు దాదాపు 150 అడుగుల లోతుకు చేరుకున్నాయని అంచనా. అవి డ్యామ్వైపుగా విస్తరించే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణానదికి గరిష్టంగా 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందనే అంచనాతో దిగువకు 19.95లక్షల క్యూసెక్కుల విడుదల చేసేలా శ్రీశైలం డ్యాంను నిర్మించారు. మొదట్లో డ్యాం సామర్థ్యం 308 టిఎంసిలు కాగా పూడిక భారిగా పెరిగి పోవడంతో ఇపుడు నీటి నిల్వపామర్థ్యం 215 టిఎంసిలకు పడిపోయింది. పూడికతో నిల్వసామర్థ్యం తగ్గిపోవడంకు తోడు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఇపుడు డ్యామ్ మనుగడకే ముప్పు ఏర్పడింది.
కృష్ణా నదికి తగ్గిన వరద
కృష్ణా నదికి వరద ఉధృతి తగ్గింది. శనివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఔట్ ఫ్లో 2,64,199 క్యూసెక్కులు కాగా, పులిచింతల దగ్గర ఔట్ ఫ్లో 84,780 క్యూసెక్కులుగా నమోదయింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. వరద పూర్తిగా తగ్గేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.