ఏపీలో షెడ్యూల్డ్ కులాలకు మూడు కార్పొరేషన్‌లు
షెడ్యూల్డ్ కులాల వారికి మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కార్పొరేషన్’, ‘ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కార్పొరేషన్’, ‘ఆంధ్రప్రదేశ్ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు ముందు పలువురు షెడ్యూల్డ్ కులాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి కులాల వారీగా ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీకి మూడు కార్పొరేషన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.