శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (08:35 IST)

జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. ఏపీ మంత్రులు

ఇటీవల నెదర్లాండ్స్ లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత విభాగంలోనూ, జట్టు విభాగంలోనూ కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మలు గురువారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ విలువిద్యలో పతకాలను సాధించడం ద్వారా జ్యోతిసురేఖ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర సమచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని నాలుగవ బ్లాక్ లోని ప్రచార విభాగంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో  వెన్నం జ్యోతిసురేఖను మంత్రులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇటీవల నెదర్లాండ్స్ లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత విభాగంలోనూ, జట్టు విభాగంలోనూ కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నానన్నారు. అటు క్రీడలతో పాటు విద్యలో కూడా జ్యోతిసురేఖ ప్రతిభకనబరచడం ఆదర్శనీయమన్నారు.

భవిష్యత్ లో దేశానికి, రాష్ట్రానికి బంగారు పతకాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యోతిసురేఖ క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సురేఖ ఆర్చరీలో పతకం సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడం పట్ల అభినందిస్తున్నామన్నారు.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో తొలిసారి భారతదేశం తరపున పతకాన్ని సాధించిన వ్యక్తిగా జ్యోతిసురేఖ చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. జ్యోతిసురేఖకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని  ఆమె పేర్కొన్నారు. సురేఖను క్రీడల పట్ల ప్రోత్సాహం అందించిన వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించడం సముచితమన్నారు.

ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత వెన్నం జ్యోతిసురేఖ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించడంతో  పాటు అంతర్జాతీయ స్థాయిలో 32 బంగారం, వెండి, కాంస్య పతకాలను సాధించడం జరిగిందన్నారు.

ఇటీవల నెదర్లాండ్ లో జరిగిన 50వ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో ఆర్చరీలో వ్యక్తిగత, జట్టు విభాగంలో రెండు కాంస్య పతకాలను సాధించడం జరిగిందన్నారు. భవిష్యత్ లో జరగబోయే మరిన్ని అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకం సాధించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ తండ్రి వెన్నం సురేంద్రకుమార్ మంత్రులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు.