శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (16:45 IST)

శ్రీవారి ద‌ర్శ‌నం మిస్ అయిన భ‌క్తుల‌కు టీటీడీ మ‌రో అవ‌కాశం

ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల తిరుమ‌ల తిరుప‌తి ద‌ర్శ‌నాన్ని చాలా మంది మిస్ అయ్యారు. తిరుమలలో భారీ వర్షాల కారణంగా టిక్కెట్లు ఉండి కూడా చాలా మంది భ‌క్తులు శ్రీవారిని దర్శించుకోలేక పోయారు. ఇలా ఈ నెల 18 నుంచి 30వ తేదీ లోపు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు టీటీడీ మరొక అవకాశం ఇచ్చింది. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నామ‌ని టీటీడీ అదనపు ఈవో  ఏవి ధర్మారెడ్డి చెప్పారు.
 
 
భ‌క్తులు త‌మ పాత టిక్కెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఆరె నెల‌లోపు వేరొక స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామ‌న్నారు. టీటీడీ చైర్మన్, ఈవో ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. తిరుమ‌ల కొండ‌పైన అధిక వర్షపాతం నమోదు అయినా, ఒకటి రెండు ప్రదేశాల్లో మినహా మరెక్కడా నష్టం జరగలేద‌ని, భక్తులు నిర్భయంగా తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవచ్చ‌ని చెప్పారు. 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయ‌ని, అయితే, అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నష్టం వాటిల్లలేద‌న్నారు. 
 
 
శ్రీవారి మెట్టు వద్ద నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయ‌ని, కల్వర్టులను మరమత్తులు చేయడానికి కొంత సమయం పడుతుంద‌ని, అందుకే, శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంద‌న్నారు. భ‌క్తులు అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు రావొచ్చ‌ని అద‌న‌పు ఈవో చెప్పారు.