సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (09:57 IST)

తిరుపతి ఉప ఎన్నికలు.. బీజేపీకి సలాం కొట్టేది లేదు.. పవన్ కల్యాణ్.. బీటలు తప్పవా?

తిరుపతి ఎంపీ సీటుకు సంబంధించిన ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. 
 
తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్‌‌ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్‌ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం.
 
దీంతోపాటు తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చామని, మరో వారంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే అవగాహనకు వచ్చాం. ఇంకా రెండు సార్లు సిట్టింగ్ వేస్తాం. హైదరాబాద్, మంగళగిరి ఢిల్లీలో కూర్చుని మాట్లాడతాం. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే తిరుపతిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. తాము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం కాబట్టి తమకు ఆ సీటు ఇవ్వాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఏర్పాటు చేసిన సయోధ్య కమిటీ ఇంకా ఏమీ తేల్చలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతిలో పర్యటించిన సమయంలో అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించడం జనసేనను ఇరుకున పెడుతోంది. ఇంకా జనసేన, బీజేపీ మధ్య బీటలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.