శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (15:27 IST)

మత్తు బానిసలకు కేంద్రంగా మారుతోన్న తిరుపతి

ఏపీ ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి నగరం.. మత్తు బానిసలకు కేంద్రంగా మారుతోంది. తిరుపతిలో ఎటు చూసినా మత్తు ప్రియులు కనిపిస్తున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సైతం పట్టించుకోకుండా మత్తు బానిసలు చెలరేగిపోతున్నారు. 
 
ఏకంగా రోడ్డు పక్కనే మత్తును సేవిస్తున్నారు. ఇవేవీ ఆరోపణలు కావు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. పైగా ఈ మాటలు అంటుంది స్వయంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
 
తిరుపతిలో లాక్‌డౌన్‌ ఎలా ఉందో పరిశీలిచేందుకు సైకిల్ పై వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. షట్టర్లు మూసేసి ఉన్న షాపుల వద్ద, కూడళ్లలోనూ గంజాయి సేవిస్తూ చాలా మంది కనిపించారు. వాళ్లంతా మాస్క్‌లు ధరించలేదు. పైగా భౌతికదూరం నిబంధన ఉల్లంఘించి మరీ గంజాయి సేవిస్తున్నారు. దీంతో భూమన ఆగి క్లాస్ పీకారు. ఒక చోట.. కాదు.. చాలా చోట్ల ఇవే దృశ్యాలు కనిపించాయి. దీంతో నిషాలో మునిగి తేలుతున్నవారికి గట్టిగానే క్లాస్‌లు తీసుకున్నారు.
 
కొంతమంది ఎమ్మెల్యేకు సమాధానం చెప్పలేక అక్కడ నుంచి పరుగులు తీశారు. లాక్‌డౌన్‌ అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన తనకు మత్తు బానిసలు కనిపించారంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. 
 
ఎక్కడ చూసినా మత్తు బానిసలు కనిపిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా తిరుపతి ఎస్పీ అప్పలనాయుడును కలిసిన ఎమ్మెల్యే భూమన… నగరంలో మత్తు సంస్కృతిని పారద్రోలాలంటూ ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
 
తిరుపతిలో చేసిన సైకిల్ యాత్రలో తన అనుభవాలను లేఖలో ఉదహరించారు భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుపతి నగరంలో ఎటు చూసినా మత్తు బానిసలు కనిపించారని, ఈ అంశంపై దృష్టి సారించాలని ఎస్పీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. తిరుపతిలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.