సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (09:55 IST)

జూన్ 1 నుంచి జూలై 31వరకు.. అలిపిరి మెట్ల మార్గం మూసివేత.. ఫాస్టాగ్ ఛార్జీలు..?

తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు జూన్ 1 2021, నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
 
తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
 
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని, అటు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. దీంతో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు.
 
గతంలో ద్విచక్ర వాహనాలకు 2 రూపాయల చార్జీ వసూలు చేస్తుండగా.. ఇకపై ఉచితంగానే వాటిని అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాలకు గతంలో 15 రూపాయల చార్జీ ఉండగా ఇకపై 50 రూపాయలు వసూలు చేయనున్నారు.