శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:20 IST)

బర్డ్ ఆసుపత్రి పేషంట్ ఫ్రెండ్లీ‌గా ఉండాలి : తితిదే ఈవో

బర్డ్ ఆసుపత్రిలో ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాలు, రోగులకు తక్కువ ధరలో మందులు అందించే ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం బర్డ్ ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఈవో సమీక్ష జరిపారు.
 ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, బర్డ్, స్విమ్స్, సెంట్రల్ హాస్పిటల్ కు అవసరమయ్యే మందులు, పరికరాలు ఓకే విభాగం ద్వారా కొనుగోలు చేయడానికి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెల్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. 
 
బర్డ్ ఆసుపత్రి పేషంట్ ఫ్రెండ్లీ ఆసుపత్రిగా ఉండాలనీ, హెల్ప్ డెస్క్‌లు, రిసెప్షన్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను వెంటనే ఉపయోగం‌లోకి తేవాలని చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. 
 
అధునాతన పరికరాల కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. క్యాథ్, ల్యాబ్ మే 30వ తేదీకి  ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెలాఖరుకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలని డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు బర్డ్‌కు వచ్చి శ్రీవారి సేవగా వైద్య సేవలు,ఆపరేషన్లు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 
 
అనంతరం జరిగిన మరో సమీక్షలో ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, అలిపిరి - తిరుమల నడక దారిలో రోడ్డు పక్కల ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
తిరుమలలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధించిన విషయం గురించి భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. కొండ మీద ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున అలిపిరిలోనే వాటర్ బాటిళ్లను అనుమతించారాదన్నారు.