మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:12 IST)

శ్రీవారి సేవా టిక్కెట్లు గోల్‌మాల్ - ఆ ఎమ్మెల్యేని పట్టుకున్నారు..?

తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్లులో అక్రమాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం టిటిడి విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒకేసారి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొని… ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డును క్షుణ్

తిరుమల శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్లులో అక్రమాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం టిటిడి విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒకేసారి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొని… ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నకిలీ గుర్తింపు కార్డులతో దర్శనానికి వచ్చిన వారిని పదుల సంఖ్యలోనే పట్టుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా పట్టుబడిన వారిలో…. ఎంఎల్‌ఏల సిఫార్సు లేఖల ద్వారా టికెట్లు పొందినవారూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
150 మంది దాకా నకిలీ గుర్తింపు కార్డులతో వచ్చారని, 30 మందికి పైగా పిఆర్‌వోల రూపంలో ఉన్న దళారులు పట్టుబడ్డారని టిటిడి అంతా గుప్పుమంటోంది. ఇంతటి చర్చనీయాంశంగా మారిన ఈ తనిఖీల గురించి టిటిడి ఉన్నతాధికారులు వివరాలు బయటకు పొక్కనీయడం లేదు. ఇటీవల రూ.300 దర్శనానికి నకిలీ గుర్తింపుకార్డులతో వచ్చిన భక్తులు పట్టుబడిన నేపథ్యంలో బ్రేక్‌ దర్శనంలోనూ తనిఖీలు నిర్వహించామని, అందరూ బాగా సహకరించారని జెఈవో శ్రీనివాసరాజు చెప్పారు. 
 
ఇంతకుమించి ఈ తనిఖీల్లో ఎవరైనా పట్టుబడ్డారా, ఎవరి సిఫార్సు లేఖలపై టికెట్లు పొందిన వారు అక్రమంగా వచ్చారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వంటి వివరాలేవీ చెప్పలేదు. ఈ తనిఖీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. విఐపిల బండారం బయటపడుతుందన్న ఆందోళన అధికారుల్లో ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. వివరాలను గోప్యంగా ఉంచేకొద్దీ… ఇటువంటి అనుమానాలు వస్తూనే వుంటాయి. ఎక్కడ గోప్యత ఉంటే అక్కడ అక్రమాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
 
తిరుపతి ఎంఎల్‌ఏ సుగుణమ్మ ఇటీవల టిటిడి అధికారుల తీరును తప్పుబట్టారు. ప్రోటోకాల్‌ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె అనుచరులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించారన్న ప్రచారమూ జరుగుతోంది. టికెట్లు బ్లాక్‌లో కొనుగోలు చేసినట్లు రాసివ్వమంటూ ఒక రాజకీయ నాయకుడి సిఫార్సు లేఖలపై దర్శనానికి వచ్చిన వారిపై ఒత్తిడి చేసినట్లూ ప్రచారం జరిగింది.
 
బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి 2015లో ఓ ఉన్నతాధికారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు ఎన్నెన్ని టికెట్లు తీసుకున్నారో మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది… అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత అలాంటి వివరాలేవీ బయటపెట్టలేదు. అంటే… విలేకరులను గుప్పెట్లో ఉంచుకోడానికే ఆ విధంగా బెదిరించారని మీడియాలోని వ్యక్తులు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జరిగిన తతంగమూ అటువంటిదే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా టిటిడి ఉన్నతాధికారులు స్పందించి… గురువారం తనిఖీ సందర్భంగా ఏం జరిగిందో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తే బాగుంటుందంటున్నారు.