తుడా ఖ్యాతిని పెంపొందించాలి : ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఖ్యాతిని పెంపొందించే దిశగా సిబ్బంది పనిచేయాలని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చెవిరెడ్డి తుమ్మలగుంటలోని నివాసం వద్ద తుడా సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అటువంటి గుర్తింపు కలిగిన ప్రదేశంలో పనిచేస్తుండటం అదృష్టంగా భావించాలని అన్నారు. కుటుంబ సభ్యుల్లా అందరం కలిసికట్టుగా పనిచేసి తుడాకు గొప్ప పేరును తీసుకొద్దామని సూచించారు.
అంతకుముందు తుడా కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఇఇ వరదా రెడ్డి, డీఈ కృష్ణా రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.