గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (20:17 IST)

గవర్నర్ - ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు

ఆనందకరమైన దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ తెలిపారు. ఇదే అంశంపై రాజ్‌భవన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీపావళి యొక్క దైవిక కాంతి మన అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. 
 
కరోనా వంటి సందర్భాలు, విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి మనం కృషి చేయాలి. ముసుగు ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించటం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్నందున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా మనందరికీ జగన్నాథ్, వెంకటేశ్వరుడిని ఆశీర్వాదాలను లభించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇకపోతే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.
 
అంతకుముందు.. గవర్నరుతో సీఎం జగన్ సమావేశమయ్యారు. దీపావళి పండగ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. సతీమణి వైయస్‌ భారతితో సహా రాజ్‌భవన్‌ వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్‌కు వివరించారు.