భర్త మీద కోపంతో బిడ్డను చంపిన తల్లి...
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జిరగింది. భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కానీ, ఇటుక కొట్టిన దెబ్బలు తాళలేక ఇద్దరు పిల్లలు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు రావడంతో ఆ తల్లి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లాలోని దావరిఖని, సప్తగిరి కాలనీలో రమాదేవి అనే మహిళ భర్తతో కలిసి నివశిస్తోంది. వీరికి అజయ్, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మాత్రం ఎన్టీపీసీలో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త విధులకు వెళ్లాడు. అయితే, భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.