బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (22:33 IST)

అమరావతికి ఇచ్చే నిధులు ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటాం : నిర్మలా సీతారామన్

nirmala sitharaman
లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. అయితే ఈ నిధులు ఏ రూపంలో ఇస్తుందన్నదానిపై క్లారిటీ లేదు. కేంద్రం గ్రాంటుగా ఇస్తుందా లేదా రుణంగా ఇస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనిపై విత్తమంత్రి నిర్మలా సీతారమన్ క్లారిటీ ఇచ్చారు., 
 
'ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. దాని ప్రకారం మేం తప్పనిసరిగా ఏపీకి సాయం అందించాలి. ఇప్పుడు మేం అమరావతికి కేటాయించిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాం. దానికి తదనంతర నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఇక ఈ ఋణం చెల్లింపులు ఎలా అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాలి. ఎందుకంటే, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, వాళ్ల వాటాను చెల్లించగలరా? లేదా? అన్నది మాట్లాడాలి. అప్పుడు వాళ్ల వాటాను కూడా కేంద్రమే గ్రాంట్‌గా ఇవ్వడమన్నది వాళ్లతో మాట్లాడాక నిర్ణయిస్తాం. దీనిపై మేం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళతాం.
 
ఇప్పటికే ఏపీకి రాజధాని లేకుండా పదేళ్లు గడచిపోయాయి. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే, దానికి రాజధాని ఉండాలి. కానీ రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం ఆంధ్రా. దీనికి కారకులు ఎవరు? అనే అంశం జోలికి నేను వెళ్లదలచుకోలేదు. రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది' అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
 
అంతకుముందు, పోలవరం ప్రాజెక్టు అంశంపైనా నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని, కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తోందని, అందువల్ల పోలవరం అంశంలో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని వివరించారు.