శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:10 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యురేనియం కోసం అన్వేషణ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

jithendra singh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యురేనియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు కేంద్ర అణు ఇంధన శాఖామంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గురువారరం రాజ్యసభలో విపక్ష సభ్యుడు బల్బీర్ సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
ఏపీలో నాలుగు జిల్లాల్లో యురేనియం నిల్వల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు చెప్పారు. కడప జిల్లాలోని నల్లగొండవారి పల్లె, అంబకపల్లె, బక్కన్నగారిపల్లె, శివారంపురం, పించ, కుమరంపల్లె, నాగాయపల్లెలో అన్వేషణ సాగుతుందన్నారు. 
 
అలాగే, పల్నాడు జిల్లాలో సారంగపల్లె, మదినపాడు, తంగెడ, కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె, వినకహల్ పాడు, కప్పట్రాళ్ళ, అన్నమయ్య తిరుపతి జిల్లాలో కాటమయకుంట, వరికుంట పల్లెలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఈ అన్వేషణ సాగించిందని ఆయన వివరించారు. 
 
మరో గ్యారెంటీ పథకం అమలుకు సీఎం రేవంత్ కసరత్తులు 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గ్యారెంటీ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రధాన గ్యారెంటీలను ఇచ్చారు. వీటిలో రెండు గ్యారెంటీలైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. గ్యారెంటీ పథకాల్లో మరొకటి మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 
 
ఇందులో మొదటిది రేషన్ కార్డు(ఆహార భద్రత కార్డు) ఉన్నవారితోపాటు రేషన్ కార్డు లేనివారిలోనూ అర్హులను ఎంపిక చేయడం. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయడం రెండోది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో హెచ్.పి.సి.ఎల్ నుంచి 43,39,354, ఐఓసీఎల్ నుంచి 47,96,302, బీపీసీఎల్ నుంచి 29,04,338 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. 
 
మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మంది ప్రతి నెలా రీఫిల్ చేసుకుంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సుమారు 52.80 లక్షల మంది నెలకు ఒక సిలిండర్ వినియోగిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. తొలి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగానే అమలుచేయవచ్చని, అయితే అనర్హులూ లబ్ధిదారులయ్యే అవకాశం ఉంటుందని, మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావొచ్చని పౌరసరఫరాలశాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. 
 
రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే సర్వే, లబ్ధిదారులను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతుందని తేల్చింది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులు ఆయా ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. గురువారం అధికారికంగా నివేదిక అందజేశారు. ఉజ్వల్ పథకం కింద II.58 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రాయితీ వదులుకున్న వారు 4.2 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955. సాధారణ కనెక్షన్లపై ఒక్కోదాని బుకింగ్‌పై కేంద్రం రూ.40 రాయితీ ఇస్తోంది. అదే ఉజ్వల్ కనెక్షన్లకైతే రాయితీగా రూ.340 అందిస్తోంది. రాష్ట్రంలో ఉజ్వల్ కనెక్షన్లు 11.58 లక్షలుగా ఉన్నాయి. 
 
'గివ్ ఇట్ అప్'లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. మిగిలిన వినియోగదారుల్లో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అదనపు భారం ఆధారపడి ఉంటుంది. మొత్తంగా పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి ఆరు సిలిండర్లను ఒక్కోటి రూ.500కు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం సుమారు రూ.2,225 కోట్లని, ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేపక్షంలో అదనపు భారం రూ.4,450 కోట్లని పౌరసరఫరాల శాఖ అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో పథకం అమలు సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించారు.