ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మనగా కె.రామ్మోహన్ నాయుడు
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా - పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాగా, టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖామంత్రిగా ఉన్న విషయం తెల్సిందే.