గురువారం, 12 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (11:15 IST)

శరద్ పవార్ నుంచి జై షా వరకు.. ఊహించినట్టుగానే ఐసీసీ పీఠంపై హోం మంత్రి అమిత్ షా తనయుడు!

jaishah
అందరూ ఊహించినట్టుగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా చక్రం తిప్పుతున్న జై షా.. ఇకపై ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టి.. అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించనున్నారు. ఆయనను ఐసీసీ సభ్య దేశాలన్నీ కలిసి తమ తదుపరి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఐసీసీ చైర్మన్‌గా డిసెంబరు ఒకటో తేదీన బాధ్యతలు చేపడుతారు. 
 
ఐసీసీ అధిపతి అయిన అత్యంత పిన్నవయస్కుడిగా 35 ఏళ్ల షా ఘనత సాధించాడు. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ (న్యూజిలాండ్) మరో పర్యాయం పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకోవడంతో షాకు అవకాశం లభించింది. జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. వచ్చే నెల లేదా అక్టోబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొంటారు. భారత్ నుంచి ఇంతకుముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ అధిపతులుగా పని చేశారు. ఈసారి ఛైర్మన్ పదవికి షా ఒక్కరే పోటీలో నిలిచారు.
 
'ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌ను మరింత వ్యాప్తి చేయడానికి ఐసీసీ జట్టు, సభ్య దేశాలతో కలిసి పని చేస్తా. క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచడమే మా లక్ష్యం' అని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో షా పేర్కొన్నాడు. ఐసీసీ ఆదాయంలో 75 శాతం భారత్ నుంచే వస్తున్న నేపథ్యంలో పోటీపడితే జై షా ఎన్నికవుతాడనే విషయంలో ఎప్పుడూ సందేహాలు లేవు.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా బోర్డులలో ఒకటి షా పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. 
 
బీసీసీఐ కార్యదర్శిగా 2025లో షా పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత మూడేళ్ల తప్పనిసరి విరామం ఉండేది. అంటే 2028 వరకు బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో ఉండడానికి జై షాకు అవకాశం లేదన్నమాట. మరోవైపు, ఐసీసీ చైర్మన్‌గా జై షాకు మొదటి సవాలు పాకిస్థాన్‌లో ఎదురుకానుంది. ఆ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఆతిథ్వమివ్వనుంది. పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ తిరస్కరిస్తున్న నేపథ్యంలో షా ఏం చేస్తాడో చూడాలి. మరోసారి హైబ్రిడ్ విధానమే మార్గంగా కనిపిస్తోంది. తమ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్ ఆడతామన్నది బీసీసీఐ ప్రతిపాదన. కానీ దీన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తిరస్కరిస్తోంది.