బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 అక్టోబరు 2025 (14:38 IST)

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

knife
ఏపీలోని కడప జిల్లాలో దారుణం జరిగింది. మందలించిన కన్నతల్లిని ఓ కిరాతక కొడుకు కత్తితో గొంతుకోసి చంపేశాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో ఈ దారుణం ఆదివారం ఉదయం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీరామ్ నగర్‌కు చెందిన యశ్వంత్ రెడ్డికి అతడి తల్లి లక్ష్మీదేవికి మధ్య ఇంట్లో ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యశ్వంత్ వంటగదిలో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేసి ఆమె గొంతు కోశాడు. 
 
అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో పడివున్న ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి పడేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడే సమయంలో తన తండ్రిని మరో గదిలో బంధించడం గమనార్హం. మృతుహాలు లక్ష్మీదేవి స్థానిక ఈశ్వరరెడ్డి నగర్‌లో ఉన్నఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు యశ్వంత్ రెడ్డి మానసికస్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివిన కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా విషాదం నెలకొంది.