గురువారం, 2 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2025 (09:18 IST)

సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించిన పాకిస్థాన్ సైన్యం

pakistan flag
ఉగ్రవాద నిరోధక  చర్యల్లో భాగంగా సొంత గ్రామానికి చెందిన ప్రజలపై పాకిస్థాన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కనీసం 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ గ్రామంపై పాకిస్థాన్ వైమానికదళం మొత్తం 8 బాంబులు జారవిడిచింది. 
 
ఖైబర్ ఫఖ్తున్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన జేఎఫ్-17 ఫైటర్ జెట్లు ఎనిమిది ఎల్ఎస్-6 బాంబులు జారవిడవడంతో కనీసం 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. సోమవారం వేకువజామున 2 గంటల సమయంలో తిరా లోయలోని మాత్రై దారా అనే గ్రామంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలామంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
కాగా క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. సంఘటనా స్థలంలో మరణించిన చిన్నారులు సహా పలువురి మృతదేహాలు పడి ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అక్కడికి సహాయక బృందాలు చేరుకుని శిథిలాల కింద పడి ఉన్న మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. 
 
గతంలో కూడా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో పాక్ జరిపిన వైమానిక దాడుల్లో చాలామంది అమాయకులు మరణించారు. డ్రోన్ల దాడులు చేసినపుడు దేశ పౌరుల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పాకిస్థాన్ అధికారులు విఫలమయ్యారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది.