బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (10:45 IST)

భారత పౌరులకు శ్రీలంక వీసా రహిత ప్రవేశం... అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు

sri lanka
ఆర్థిక సంక్షోభం నుంచి ఇపుడిపుడే గట్టెక్కుతున్న శ్రీలంక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులోభాగంగా, భారతీయులకు ఓ తీపి కబురు చెప్పింది. ఆరు నెలల పాటు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. భారత్ సహా 35 దేశాల వారికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
 
ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. భారత్‌పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి. కాగా, శ్రీలంకలో ఆన్ అరైవల్ వీసాల కోసం పెరిగిన ఛార్జీలను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
మరోవైపు, భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్టు గతేడాది అక్టోబరులో శ్రీలంక తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టు గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను చేర్చి ఈ పైలట్ ప్రాజెక్టును విస్తరించింది. ఇక పైలట్ ప్రాజెక్టులోని ప్రయాణికులు శ్రీలంకకు రాగానే డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇస్తారు. ఫ్రీ వీసా ద్వారా శ్రీలంకలో 30 రోజుల వరకు బసకు అవకాశం ఉంటుంది.