శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (12:41 IST)

మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్య కళ్యాణం' గారూ? : విజయసాయి రెడ్డి ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శల వర్షం కురిపించారు. ఇష్టమైతే ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోండంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ ఇచ్చిన సలహాపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 
 
మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముందని, ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని పవన్ సలహా ఇస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్య కళ్యాణం'గారూ? అని ప్రశ్నించారు. 
 
ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థపై గౌరవంలేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరని అన్నారు. అతిగా ఊహించుకోవద్దని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు. 
 
కాగా, ముగ్గురు పెళ్లాలు, నలుగురో లేదా ఐదుగురో పిల్లలు ఉన్న పవన్ కల్యాణ్ వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం లేదా? అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు. వీటికి విజయసాయి రెడ్డి బుధవారం కౌంటరిచ్చారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై ఈ నెల 14న ఉదయం నుంచి 8 గంటల నుంచి రాత్రి‌ 8 గంటల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు దిగనున్నారు. 
 
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలియజెప్పడానికే ఇసుక దీక్ష చేస్తున్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. అలాగే, 14వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనిపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 
 
'కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు' అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.