గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (18:15 IST)

లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్‌ జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి

lingamaneni guest house
కృష్ణా జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తునకు విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు అనుమతించింది. అయితే, జప్తు చేసేందుకు ముందు తొలుత లింగమనేని రమేశ్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. 
 
జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని ఈరోజు తుది తీర్పు వెలువరించింది. గెస్ట్‌ హౌస్‌ జప్తునకు సీఐడీ అధికారులకు అనుమతిచ్చింది.
 
వైకాపాకు ఒక్కసీటు కూడా రాకూడదు : పవన్ కళ్యాణ్ 
 
వచ్చే ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అలాగే, వెస్ట్ గోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క జెండా కూడా రాకూడనది ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, నేతలంతా కలికట్టుగా పని చేయాలని ఆయన కోరారు. 
 
తాను చేపట్టిన వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో తోట సుధీర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ కీలక ప్రసంగం చేశారు. 
 
'చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తుల్లో తోట సుధీర్‌ ఒకరు. ఆయన కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. పార్టీ బలంగా ఉండాలంటే అందరి మద్దతు అవసరం. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాకు ఒక్క సీటు కూడా రాకూడదు. 
 
ఎందుకు రాకూడదో అందరికీ తెలుసు. పోరాటం చేసే వారిపైనే కేసులు పెడుతున్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు లేవు. రైతులకు మద్దతు ధర లేదు. వచ్చే నెల 4, 5 తేదీల్లో మరోసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తా' అని పవన్‌ తెలిపారు. 
 
వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్ 
 
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రిమండలిలోని మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. కేంద్రం ఆదేశాలతో ఆయన జారీ చేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మంత్రిమండలి నుంచి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేసే వ్యవహారంలో న్యాయ సలహా తీసుకోవాలంటూ కేంద్రం సలహా ఇచ్చింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. 
 
అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆ సమయంలో జరిగిన చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం మంత్రి సెంథిల్‌కు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిని కేబినెట్ నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం జోక్యం చేసుకుని ... బర్తరఫ్ అంశంపై తొలుత న్యాయ సలహా తీసుకోవాలని సలహా ఇచ్చింది. 
 
దీంతో గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హోల్డ్‌లో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 14వ తేదీన మంత్రిని ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయనను శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ గవర్నర్‌కు సీఎం స్టాలిన్ లేఖ రాయగా, ఆయన నిరాకరించారు. దీనికి ప్రతిగా సెంథిల్ బాలాజీని శాఖలేని మంత్రిగా కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రిని డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇపుడు కేంద్ర సూచనలతో ఆయన వెనక్కి తగ్గారు.