సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (08:52 IST)

చంద్రబాబు ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వండి... ఏపీ సీఐడీ

chandrababu
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట సమీపంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నివాసాన్ని జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.
 
కాగా, అమరావతి రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ... విజయవాడ అనిశా కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై మంగళవారం తీర్పు వెలువడనుంది.