బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మార్చి 2025 (16:11 IST)

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ : 25 వరకు జైల్లోనే...

Vallabhaneni Vamsi
గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆఫీస్ ఉద్యోగి సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆయనను మంగళవారం వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. కాగా, ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కోర్టు రిమాండ్ పొడగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులే నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వంశీకి మార్చి 25వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వంశీ నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులోనూ ఆయన రిమాండులో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే ఇదే విధంగా ఆన్‌లైన్ విధానంలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది. 
 
మరోవైపు, భద్రతా కారణాల రీత్యా విజయవాడ జైలులో వల్లభనేని వంశీ మోహన్ బ్యారక్‌ను మార్చడం వీలుపడదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. తనను సింగిల్ బ్యారక్‌లో ఉన్న గది నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌లోకి మార్చాలంటూ లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనికి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా వంశీని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచామని, అక్కడ నుంచి ఇతర ఖైదీలు ఉండే బ్యారక్‌లోకి మార్చడం సాధ్యపడదని కోర్టుకు తెలిపారు.