శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (09:09 IST)

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు మరోమారు పెంపు

aadhaar
ఆధార్ కార్డులోని తప్పొప్పులను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత అప్‌డేట్ గడువును మరోమారు పొడగించింది. ఈ మేరకు ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ నంబరు ఎంతో కీలకంగా మారింది. వ్యక్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డు అయిన ఆధార్.. మొబైల్ సిమ్ కార్డు కొనుగోలుకు మొదలు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, వాహనాలు, భూములు, ఇళ్లు క్రయవిక్రయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి అనేక అంశాలలో తప్పనిసరిగా మారిపోయింది. 
 
అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో మార్పులు వస్తుండటం సర్వసాధారణం. అంతేకాకుండా ఇంటి చిరునామాలు మారుతుండటంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతి పదేళ్లకు ఒక సారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది దశాబ్దాలు గడుస్తున్నా ఆధార్ అప్డేట్ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి అధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది.
 
ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో సారి పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్ అధికారిక వెబ్ సైట్ http://myaadhar.uidai.gov.in లో అధార్ నెంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.