బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (23:07 IST)

కడప జిల్లాలో నివార్ తుఫాన్ బాధితులను ఆదుకుంటాం: మంత్రులు

కడప జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా నివేదికలను ప్రభుత్వానికి నివేదించి భాదితులకు త్వరితగతిన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి. అంజాద్బాష, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ లు అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో.. జిల్లాలో "నివర్" తుఫాను - వరదలు, నష్టాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ప్రభుత్వ సలహాదారులు తదితరులతో కలిసి... ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి. అంజద్ భాష, జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా " నివర్ " తుఫాను వల్ల జిల్లాలో సంభవించిన వరదలు, నష్టాలు, చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పవర్ పాయింట్ ద్వారా సమగ్రంగా వివరించారు.
 
ఈ సమావేశంలో ఎస్పీ అన్బురాజన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారులు రాజోలు వీరారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణా రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంభటూరు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి), ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్. రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జేసిలు ఎం.గౌతమి, సి.ఎం.సాయికాంత్ వర్మ, కడప, రాజంపేట సబ్ కలెక్టర్లు పృద్వితేజ్, కేతన్ గార్గ్, ట్రైనీ కలెక్టర్ వికాస్ మర్మాట్, డిఆర్వో మాలోల తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాలోని 51 మండలాల్లోనూ.. సుమారు 142010 హెక్టర్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలపైన "నివర్" తుఫాను ప్రభావాన్ని చూపిందని, ఇందులో 136989 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 5021 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా శెనగ, వరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే.. రబీ సాగు కోసం అందజేసిన 40 క్వింటాళ్ల విత్తనం నష్టపోగా.. 30% నుండి 40% మంది రైతులు సీడ్ మళ్ళి ఇస్తే మళ్ళీ పంటలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
 
సమావేశంలో.... జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లాలో వరద నష్టాన్ని పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరిస్తూ.. జిల్లాలో అత్యంత వర్షపాతం నమోదైందని, ప్రధానంగా రెండు ప్రాజెక్టులు దెబ్బతిని నీరు వృథా అయిపోగా.. మరో ప్రోజెక్టు వరద ఉధృతి.. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయని వివరించారు. "నివర్" తుఫాను ప్రభావంతో జిల్లాలో 51 మండలాల్లో నవంబర్ 25, 26, 27 మూడు రోజుల పాటు... ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయన్నారు. 

25 తేదీ 42.5 మిల్లీమీటర్లు, 26వ తేదీన 98.4 మిల్లీమీటర్లు, 27వ తేదీ 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం మొత్తంగా 158.1 ఎంఎం వర్షపాతం నమోదయిందన్నారు. ఈ భారీ వర్ష ప్రభావంతో జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి డిసెంబరు 5 వరకు 626.2ఎంఎం సాధారణ వర్షపాతానికి 1055.3 ఎంఎం వర్షపాతం కురిసి 68.5 శాతం అధిక వర్షపాతం జిల్లాలో నమోదు అయింది.

జిల్లాలోని 51 మండలాలలో 4 మండలాలు మినహా 47 మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది - కలెక్టర్ సి.హరికిరణ్. ఈ మూడు రోజుల్లో జిల్లా అంతా 15 సెం.మి.ల వరకు వర్షపాతం నమోదయిందన్నారు. 15 మండలాల్లో 10-15 సెం.మి.లు, 14 మండలాల్లో 15-20 సెం.మి.లు, 13 మండలాల్లో 20-25 సెం.మి.ల వర్షపాతం నమోదయిందన్నారు. 25 సెంటి మీటర్ల అత్యధిక వర్షపాతం కారణంగా రైల్వే కోడూరు మండలంలో బ్రిడ్జిలు, రోడ్లకు అధిక మేర నష్టం జరిగిందన్నారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
 
జిల్లాలో మైనర్ ప్రాజెక్ట్స్ పై..
"నివర్" తుఫాను ప్రభావం ఎక్కువగా పడిందన్నారు. ఇందులో కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు ఎక్కువగా ప్రభావం అయింది. వరదల కారణంగా.. రాజంపేట నియోజకవర్గంలోని 0.327 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పించా ప్రాజెక్టులో.. 58000 క్యూసెక్కుల సామర్ధ్యానికి మించి  1,20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో... దాదాపు 140 మీటర్ల మేర రిజర్వాయర్ కు గండి పడిందన్నారు. చిత్తూరు జిల్లా నుండి వచ్చే వరదనీరు పింఛా ప్రాజెక్టు వచ్చిచేరి.. అక్కడ నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వెళతాయని వివరించారు.
 
మధ్యతరహా ప్రాజెక్టులపై ప్రభావం...
కడప జిల్లాలో నాలుగు మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో సగిలేరు ప్రాజెక్టు మినహా.. బుగ్గవంక, అన్నమయ్య, వెలిగల్లు ప్రాజెక్టులకు "నివర్" తుఫాను ప్రభావంతో భారీగా నీరు వచ్చిచేరింది. అన్నమయ్య ప్రాజెక్టు... 2.231 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న  అన్నమయ్య ప్రాజెక్టులో.. సామర్ధ్యానికి మించి 2,25,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందన్నారు. ఈ ప్రభావంతో.. మొత్తం ఐదు గేట్లలో మూడు గేట్లు దెబ్బతిన్నాయన్నారు. దీంతో నీరు వృధాగా పోయిందన్నారు.

దీనికోసం హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు కూడా చేపట్టడం జరిగింది. బుగ్గవంక  ప్రాజెక్టు:-  0.506 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న బుగ్గవంక ప్రాజెక్టులో.. సామర్ధ్యానికి మించి 19,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదలాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  నవంబర్ 26వ తేదీ సాయంత్రం 4 గం. సమయానికి 5000 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉండగా.. దాదాపు నాలుగు గంటల వ్యవధిలో రాత్రి 8 గంటలకు ఇన్ ఫ్లో..19 వేల క్యూసెక్కులకు పెరిగిందన్నారు.

కడప పట్టణం గుండా నాలుగు కిలోమీటర్ల మేర... ఉన్న ఈ బుగ్గవంక కాలువకు దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో 2006 - 07లో బుగ్గవంక రక్షణ గోడను నిర్మించడం జరిగింది. ఈ కట్టడం ద్వారా ప్రస్తుతం బుగ్గవంక పరివాహ ప్రాంత నగరవాసులకు 50% మేర ఉప్పెన వరద ముప్పు తప్పిందన్నారు..  ఈ సేఫ్టీ వాల్ లేకుంటే.. దాదాపు పది వేల ఇళ్లు వరద ఉప్పెనకు నీట మునిగేవన్నారు. ఇప్పటికి ఇంకా పెండింగులో ఉన్న అక్కడి వాల్స్ మధ్య గ్యాప్ లను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

2005 లో రూ.69 కోట్లతో 8.15కి.మీ. మేర చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు 6.95 కి.మీ. మేర పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకనూ 3.2 కి.మీ. పొడవు మేర.. వాల్ నిర్మాణం పూర్తి చేయాల్సివుందన్నారు. అందుకు గాను రూ.35 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంతేకాకుండా దీనికి అనుబందంగా రోడ్లు కూడా నిర్మించాల్సి ఉందని అందుకు గాను రూ.14 కోట్లు.. కలిపి మొత్తం రూ.49 కోట్లు అంచనా వ్యయం అవుతుందన్నారు.

రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేస్తే... భవిష్యత్తులో ఇలాంటి వరద ముప్పు ఉండబోదు అని తెలిపారు. ఈ ప్రక్రియను అంత పూర్తి చేయడానికి.. పరివాహ ప్రాంతంలోని 150 ఇళ్లను ఖాళీ చేయించాల్సి అవసరం ఉందని, అందుకోసం భూసేకరణ కూడా చేయాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. రాయచోటి నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా..2008లో వెలిగల్లు ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు...12 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రాజెక్టు నిండలేదు. దీంతో ఇంత వరకు గేట్లు ఎత్తాల్సిన అవసరం కూడా రాలేదు. 

12 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత "నివర్" ప్రభావంతో.. డ్యాము పూర్తిగా నిండడం.. గేట్లు ఎత్తడం జరిగిందని వివరించారు. తాను ప్రభావంతో నష్టపోయిన వివరాలతో నివేదికలు అంచనా నివేదిక రూపొందించాలని ఇప్పటికే వ్యవసాయ , ఉద్యాన, పశుసంవర్ధకం, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, మైనర్ ఇర్రిగేషన్, విద్యుత్తు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల అధికారులకు ఆదేశించామని, ఇప్పటికే ఆయా  అధికారులు అంచనా నివేదిక రూపకల్పనలో నిమగ్నమయ్యారని కలెక్టర్ సమావేశంలో మంత్రులకు వివరించారు. 

అనంతరం మంత్రులు మాట్లాడుతూ....  తుఫాన్ సమయంలో ముందుచూపుతో ప్రాణ నష్టం భారీగా జరగకుండా యుద్ధ ప్రాతిపదికన  జిల్లా యంత్రాంగం తీసుకున్న సహాయ పునరావాస చర్యలు అభినందనీయమన్నారు. సహాయ కార్యక్రమాలలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అధికారులు, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వెంటనే స్పందించి ప్రాణనష్టం ఎక్కువగా జరక్కుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారని చెప్పారు. 

సమావేశంలో ఇన్చార్జి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షానే.. నిలబడి ఉందని, రైతు ఏవిధంగా కూడా నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతోందన్నారు. ఎలాంటి విఫత్తులు వచ్చినా రైతును అన్ని విధాలా ఈ ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోందన్నారు.  నివార్ వర్ష ప్రభావంతో జిల్లాలో జరిగిన పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా గణాంకాల అంచనా ప్రకారం నివేదికలు సమర్పించాలన్నారు.

నివర్ తుఫాన్ ఉపద్రవం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వరదల పై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎవరు ఊహించని విధంగా వెయ్యి రేట్లు నీటి ప్రవాహం సాగింది. జిల్లాలో బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టు నుండి అధిక స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగింది. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన వారికి సత్వరమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు5 లక్షల రూపాయల చెక్కు అందజేసాము.  తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం.

ముందు చూపుతో అధికార యంత్రాంగం జిల్లాలో ప్రాణ నష్టం లేకుండా  చూసారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 500 రూపాయలను అందజేశారు. జిల్లాలో 22 వేల మందికి 500 రూపాయలు అందజేయడం జరిగింది.  బుడ్డ శనగ పంట  పూర్తి స్థాయిలో నీట మునిగిందని ప్రజాప్రతినిధులందరూ కూడా తెలిపారు, జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడినట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం ముందుంది. 

ప్రతి రైతును ఆదుకుంటాం.. ఎవరు అధైర్య పడరాదు. రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారులు మానవతా దృక్పథంతో నివేదిక సమర్పించాలన్నారు. బుగ్గవంక సుందరీకరణకోసం ఇప్పుడు 30 కోట్లు, గతంలో ఇచ్చిన 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బురెవి, అర్నబ్ తుఫాన్ వస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి. అంజద్ భాష మాట్లాడుతూ.... నివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుంది.  వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో అధికారుల సేవలు అభినందనీయం.  పోలీసులు, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు.  స్థాయికి మించి ఇంఫ్లో రావడంతో ప్రాజెక్టుల నుండి అధిక స్థాయిలో నీటిని విడుదల చేశారు. 

అన్నమ్మయ్య, ఫించా, బుగ్గవంక ప్రాజెక్టుల నుండి పెద్ద ఎత్తున నీరు విడుదల.  పరివాహక ప్రాంతలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసారు.  వరదలో ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు, ప్రత్యేక బృందాలు నిలువరించారు. నష్టపరిహారం అందించడంలో అధికారుల మానవతా దృక్పథంతో  డిసెంబర్15 లోపు నివేదికను రూపొందించాలి.  డిసెంబర్ 30 న నష్టపోయిన వారి అకౌంటల్లో ప్రభుత్వం నష్టపరిహారం వేయనుంది. గతంలో మాదిరి లేకుండా తక్షణమే పరిహారం ఇస్తున్నాం. బుగ్గవంక సుందరీకరణ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పెండింగ్ లో ఉన్న రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధుల మంజూరు చేసింది. దివంగత నేత వైఎస్ హయాంలో మాత్రమే బుగ్గవంక సుందరీకరణ పనులు జరిగాయి. మరలా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుగ్గవంక సుందరీకరణ కు శ్రీకారం చుట్టారు. 

ముఖ్యమంత్రి ఆశయాలు, ఉద్దేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సత్వరం అందజేయడానికి అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. రాబోయే రోజులలో ఈ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారని పేర్కొన్నారు.  

సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా పేరొందిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. సూక్ష్మ నీటి సేద్య విభాగంలో గత ప్రభుత్వం బకాయి పడిన రూ.970 కోట్లను కూడా.. విడతల వారీగా చెల్లించడం జరుగుతోందన్నారు. అంతే కాకుండా.. గత ఆగస్టు, సెప్టెంబరులో జరిగిన  ఖరీఫ్ పంట నష్టానికి ఒక్క నెలలోపే పరిహారం అందించిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు.

ప్రస్తుతం "నివర్" తుఫాను ప్రభావంతో ఈ రబీ సీజన్ లో అన్ని దశలలోని, అన్ని రకాల పంటలకు సంబంధించిన.. నష్టపరిహార అంచనాలను పారదర్శకంగా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు. పరిహారం విషయంలో రైతుకు 100% శాతం పరిహారం అందించడం జరుగుతుందన్నారు. మళ్ళి పంటలు వేసే రైతులకు సబ్సిడీతో తిరిగి విత్తనాన్ని కొరతలేకుండా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. శ్రీశైలం డ్యామ్ నుండి వచ్చే మార్చి మాసం వరకు కూడా సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 

సమావేశంలో ఎమ్మెల్యేలు  ఎస్.రఘురామి రెడ్డి, పి.రవీంద్రనాథ రెడ్డి, రాచమల్లు శివప్రసాద రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డిలు మాట్లాడుతూ....  తుఫాను ప్రభావంతో నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. పంటలు ఈ క్రాప్ నమోదును ఖరీఫ్, రబీ పంటల కాలంలో నిర్దిష్ట సమయంలోగా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణీత సమయంలో ఈ-క్రాపింగ్ బుకింగ్ ప్రక్రియను చేపట్టి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు వ్యవసాయ సాగుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులు 100% లాభం పొందేలా సేవలు అందించాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీల సలహాలను సూచనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రైతు విషయంలో ముఖ్యమంత్రి ఆశయాలకు తగ్గట్టు గ్రామస్థాయిలో సేవలను అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 

"నివర్ తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక శాసన సభ్యుడిగా... తన వంతు బాధ్యతగా  పొద్దుటూరు, రాజుపాలెం మండలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకొనడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిసెంబరు 21న కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. 

సమావేశంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అరటి, చీని సాగు చేసే రైతులు నష్టపోయారని వారిని ఆదుకోవాలని కోరారు.

దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందిస్తూ... నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి ఒక్క రైతు వివరాలను పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నివేదికను రూపొందించాలని ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగిందని, గతంలో లాగా కాకుండా ప్రకృతి వైపరీత్యాలలో పంట నష్టపోయిన రైతుకు ఆ మరుసటి నెలలోనే వెనువెంటనే ఇన్పుట్ సబ్సిడీ కూడా అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు.

ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించిన నష్టాలకు అక్టోబర్ నెలలో ఇప్పటికే ఆర్థిక సాయం అందించడం జరిగిందని, ప్రస్తుత నవంబర్ నెలాఖరులో జరిగిన మొత్తానికి కూడా డిసెంబర్ మాసం చివరిలోగా ఆర్థిక సహాయం అందించే అందుకు ప్రభుత్వం  చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

అలాగే తుఫాన్ వల్ల దెబ్బతిన్న రహదారులు,ప్రాణ నష్టం, పశునష్టం, వ్యవసాయ, ఉద్యాన పంటలు, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్, ఇర్రిగేషన్, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించి పలు అంశాలపై కూడా సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.