శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (20:37 IST)

తుపాను బాధితులకు డిసెంబరు 31 కల్లా పరిహారం: జగన్

శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా సాగాయి. తొలిరోజు సభలో పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లును చర్చించకుండానే ఆమోదించినందుకుగానూ అసెంబ్లీ సమావేశాల నుండి వాకౌట్‌ చేసిన టిడిపి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

సమావేశాలకు ఎందుకు వచ్చారని టిడిపి నాయకులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నివర్‌ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని, డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.

ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం అందించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ మేరకు డిసెంబరు 31 కల్లా పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.

చంద్రబాబు హయాంలో ఏనాడూ ఇలాంటి ఆలోచన కూడా చేయలేదని తెలిపారు. కోవిడ్‌ కారణంగా పార్లమెంటు సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉందని, అందుకే కచ్చితంగా కొన్ని రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సి ఉందని జగన్‌ పేర్కొన్నారు.