ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (07:43 IST)

జగన్ కులగజ్జి మరోసారి అర్థమైంది: పిల్లి మాణిక్యరావు

‘మేడిపండుచూడ మేలిమైయుండు, పొట్టవిప్పిచూడ పురుగు లుండు’ అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వపాలన ఉందని, అందుకు ఉదాహరణగా ఆయనపాలనలో రాష్ట్రంలో వివిధవర్గాలకు జరుగుతున్న అన్యాయాలే నిదర్శనమని, టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని  పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పైకిమాత్రం దళితులు, ఇతరవర్గాలు అభ్యున్నతి చెందాలంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, తనవర్గానికి మేలుచేసుకుంటున్నాడని మాణిక్యరావు దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వివిధవిశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్ల విషయమే అందుకు గొప్ప ఉదాహరణ అని టీడీపీనేత తేల్చిచెప్పారు. 

పైకి మాత్రం ప్రజలను మోసగించేలా తియ్యనిమాటలు చెబుతూ, లోపల మాత్రం  అన్నివర్గాలవారిపై విషంచిమ్మేలా, వారిపై జగన్మోహన్ రెడ్డి ఎనలేనిద్వేషంతో ఉన్నా డన్నారు.  వీసీల నియామకంలో  జగన్ ప్రభుత్వం సామాజికవర్గాల పరంగా సమన్యాయం పాటించలేదని టీడీపీనేత స్పష్టంచేశారు.

గతంలో చంద్రబాబునాయుడి హాయాంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం వీసీగా, బీసీల్లోని కుమ్మరివర్గానికిచెందిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుని నియమించారని, వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి దామోదరం అనే ఎస్సీని, రాయలసీమ విశ్వవిద్యాలయానికి నర్సింహులు అనే నేత వర్గానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించడం జరిగిందని  మాణిక్యరావు తెలిపారు.

అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వీసీగా బలిజవర్గానికిచెందిన రాజగోపాల్ ను, రహమ్మతుల్లా అనే ముస్లిం వర్గానికిచెందిన వ్యక్తికి కూడా ఆనాడుప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం వీసీగా ఈడిగవర్గానికి చెందిన సత్యనారాయణను నియమిస్తే, అంతకు ముందు ప్రొఫెసర్ సుధాకర్ అనే ఎస్సీ వర్గానికిచెందిన వ్యక్తిని వీసీగా నియమించా రన్నారు. ఈ విధంగా టీడీపీప్రభుత్వం  వీసీల నియామకంలో సామాజికన్యాయాన్ని పాటించిందని మాణిక్యరావు స్పష్టంచేశారు. 

జగన్మోహన్ రెడ్డి మాత్రం తాజాగా నియమించిన వీసీల నియామకంలో తనసొంత సామాజికవర్గానికే అధికప్రాధాన్యత ఇచ్చాడన్నారు.  ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా ప్రతాపరెడ్డిని, శ్రీ వెంకటేశ్వర విశ్వావిద్యాలయ వీసీగా  రాజారెడ్డిని, పద్మావతి మహిళా యూనివర్శిటీకి జమునారెడ్డి, రాయలసీమ విశ్వవిద్యాలయానికి కళావతి అనే రెడ్డివర్గానికి చెందిన మహిళను, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వీసీగా మోహన్ రెడ్డిలను వీసీలుగా నియమించిన జగన్ ప్రభుత్వం,   అధికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీగా కూడా రెడ్డినే నియమించిందని  మాణిక్యరావు స్పష్టంచేశారు.

ఈ విధంగా పైకిమాత్రం తనకు కులం లేదు, మతం లేదు అనిచెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, లో లోపల మాత్రం రెడ్లపైనే  ప్రేమచూపుతున్నాడని మాణిక్యరావు ఆక్షేపించారు.  అన్నియూనివర్శిటీలకు తనవర్గానికే చెందిన జగన్మోహన్ రెడ్డి, కర్నూలులోని ఒక చిన్న  విశ్వవిద్యాలయానికి మాత్రం ఎస్సీని (మాదిగవర్గం) నియమించాడన్నారు. 

జగన్మోహన్ రెడ్డికి వందఫలాలు ఇస్తే, 99ఫలాలను తనవర్గానికే పంచుకొని, ఆఖరి ఫలాన్ని మాత్రం వందముక్కలుగాకోసి, మిగిలిన అన్నివర్గాలకు పంచేలా ఉన్నాడని మాణిక్యరావు ఎద్దేవాచేశారు. గతంలో ప్రభుత్వ సలహాదారుల నియామకంలో కూడా జగన్ ఇలానే వ్యవహరించాడన్నారు.

తనలాంటి నేరస్తుడికి, క్రిమినల్ కు, రెడ్లు మాత్రమే మంచిమంచి సలహాలు ఇవ్వగలరని భావించిన జగన్, సలహాదారుల నియామకంలో మిగిలినవర్గాలకు తీవ్ర అన్యాయం చేశాడన్నారు. కులగజ్జి, కులపిచ్చి జగన్  కు ఎంతలా ఉన్నాయంటే, ఆయనవర్గానికి ఒకపక్క న్యాయం చేసుకుంటూ, ఇతర వర్గాలకు చెందిన వారిపైమాత్రం విపరీతమైన ఈర్ష్యాద్వేషా లతో మాత్రం రగిలిపోతున్నాడన్నారు.

ఎటువంటి రిమార్కు లేకపోయినా సరే, కమ్మవర్గానికి చెందిన 60మంది డీఎస్పీలకు పోస్టింగ్ లు ఇవ్వకుండా చేయడమే  అందుకు గొప్ప నిదర్శన మన్నారు. ప్రభుత్వ నియామకాల్లో  గానీ, వీసీల ఎంపికలో గానీ, సలహాదారుల నియామకాల్లో గానీ రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి  నీచమనస్తత్వం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

జగన్మోహన్ రెడ్డి అనేపుస్తకం అట్టపై దేవుడి బొమ్మ ఉంటే, లోపలి పేజీల్లోకివెళితే, అంతా బూతుపురాణం, అబద్ధాలు, అసత్యాలే ఉంటాయని మాణిక్యరావు దెప్పిపొడిచారు. ఎస్సీవర్గానికి చెందిన ఆదిమూలపు సురేశ్ విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన వేలుముద్ర మంత్రిగానే మిగిలిపోయారనడానికి జగన్ ప్రభుత్వంలో జరిగిన వీసీల నియామకాలే నిదర్శనమన్నారు.