ఆయేషా మీరా హత్య కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు సైతం నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించారు.
అయితే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. దీంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా హత్య మరోసారి చర్చనీయంగా మారింది.
ఆయేషా మీరా ఎలా చనిపోయింది? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్న సత్యం బాబు.. ఆ తర్వాత నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు? ఈ కేసుకు, మాజీ మంత్రికి సంబంధం ఏమిటీ? ఆయేషా హత్యపై ఆమె తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? తదితర వివరాలను ఇక్కడ చూడండి.
2007, డిసెంబరు 7.. విజయవాడ లేడీస్ హాస్టల్‌లో హత్య
2007, డిసెంబరు 7, విజయవాడలోని దుర్గా లేడీస్ హాస్టల్‌లో అంతా గాఢ నిద్రలో నిద్రలో ఉన్నారు. హాస్టల్‌లోని రెండో అంతస్తులో గల ఓ కిచెన్‌లో నిద్రపోయిన ఓ యువతికి వేకువజాము 5.30 గంటలకు మెలకువ వచ్చింది. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు హాల్‌లోకి వచ్చింది.
అయితే, హాల్‌లో వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయి. హాల్‌లో బెడ్ మీద పడుకున్న ఆయేషా మీరా(17) కూడా కనిపించలేదు. నేలపై రక్తం మరకలు కనిపించడంతో కంగారుపడిన ఆ యువతి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేసింది. దీంతో ఆమె వెంటనే రెండో అంతస్తులోకి వచ్చింది. ఆ రక్తపు మరకలు బాత్రూమ్ వరకు ఉన్నాయి.
నగ్నంగా.. దారుణమైన స్థితిలో..
బాత్రూమ్‌లో రక్తపు మడుగులో దయనీయ స్థితిలో పడివున్న ఆయేషాను చూసి హాస్టల్ సిబ్బంది హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు.. ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతి మీద ‘చిరుత 143’, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడే లభించిన ఓ లెటర్‌లో.. ‘‘నన్ను ప్రేమించమని బతిమలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
హంతకుడి కోసం వేట..
ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదివేది. ఆమె హత్య తర్వాత హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలను, వార్డెన్‌ను, స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. ఘటనా స్థలంలో ఫుట్ ప్రింట్స్, శరీరం మీద వీర్యం, లేఖను స్వాధీనం చేసుకున్నారు. వీర్యం ఆధారంగా డీఎన్ఏ ప్రొఫైల్‌ను సిద్ధం చేశారు.
సుమారు 56 మంది అనుమానితులను విచారించారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఎవరికీ మ్యాచ్ కాకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి ఓ అత్యాచారం కేసులో అరెస్టయిన గురివిందర్ సింగ్ అనే వ్యక్తిని సైతం విచారించారు. అతడి ఫింగర్ ప్రింట్లు, డీఎన్‌ఏ కూడా మ్యాచ్ కాకపోవడంతో వదిలిపెట్టేశారు. అలా 8 నెలలు గడిచినా నిందితుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి బాగా పెరిగింది.
అప్రూవర్‌గా మారి.. నిజం ఒప్పుకుని..
సత్యంబాబును అరెస్టు చేసిన పోలీసులు గతంలో ఫిర్యాదులు అందిన హాస్టళ్ల వద్దకు తీసుకెళ్లారు. సత్యం బాబును అక్కడి అమ్మాయిలకు చూపించి.. హాస్టళ్లలోకి చొరబడిన వ్యక్తి ఇతనేనా అని ప్రశ్నించారు. అమ్మాయిలు ఔనని చెప్పడంతో సత్యం బాబే ఆయేషాను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు పోలీసుల్లో బలపడ్డాయి.
దీంతో ఈ కేసులో అప్రూవర్‌గా మారితే నీకు ఎటువంటి శిక్ష పడకుండా చూస్తామని పోలీసులు అతడికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యం ఒక్కో కేసు గురించి వివరిస్తూ.. ఆయేషా హత్య ఘటనపై నోరు విప్పాడు. పోలీసులు అదంతా వీడియో రికార్డు చేసి సత్యం బాబును కోర్టుకు అప్పగించారు.
నందిగామ ఘటనతో లింకు..
నిందితుడి కోసం పోలీసులు జరుపుతున్న విచారణలో ఓ కీలకమైన ఆధారం దొరికింది. విజయవాడకు సుమారు 50 కిమీల దూరంలో గల నందిగామలో ఓ వ్యక్తి అమ్మాయిల హాస్టళ్లోకి దూరి, అసభ్యంగా టచ్ చేసి వస్తువులు దొంగతనం చేస్తున్న ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. అయితే, అవన్నీ ఆయేషా హత్యకు ఆర్నేళ్ల ముందు జరిగాయి. జనవరి నుంచి జూన్ వరకు అలాంటి ఫిర్యాదులేవీ పోలీసులకు అందలేదు.
అయితే, జులై నెలలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ నేరాలకు మధ్య ఆరు నెలల గ్యాప్ రావడంతో అతడు ఏదైనా కేసులో అరెస్టయి ఉండవచ్చని పోలీసులు భావించారు. ఆ వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా సత్యంబాబు పేరు బయటకు వచ్చింది. ఓ ఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు జనవరి నుంచి జులై వరకు జైల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు 2008, 11న పోలీసులు సత్యంబాబును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.
‘ఆ రోజు రాత్రి సినిమా చూసి.. బస్టాప్‌లో నిలుచుని ఉండగా..’
‘‘7వ తరగతి వరకు మాత్రమే చదివా. నేను తాపీ పని చేస్తూ ఉపాధి పొందేవాడిని. పెళ్లయిన మూడు నెలలకే భార్య వదిలేసింది. అప్పటి నుంచి నాకు కోరికలు ఎక్కువయ్యాయి. వేశ్యల వద్దకు వెళ్తే ఎక్కువ ఖర్చవుతుందని భావించి హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు, మహిళలను టార్గెట్ చేసుకున్నా.
జైలుకు వెళ్లడం వల్ల ఇటీవల అలాంటివి చేయలేకపోయా. ఆ రోజు నేను నందిగామ నుంచి లారీ ఎక్కి విజయవాడ వెళ్లా. స్వర్ణ సినిమా హాల్లో సినిమా చూసి, తిరిగి నందిగామ వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచుని ఉన్నా. ఆ సమయంలో ఓ బిల్డింగ్ రెండో అంతస్తు కారిడార్ మీద ఓ యువతి అటూ ఇటూ తిరగడం కనిపించింది. ఆమెను చూడగానే నాలో కోరికలు కలిగాయి. ఆమెను ఏమైనా చేయాలనుకున్నా’’
‘రోకలి బండతో కొట్టి.. హత్యాచారం’
‘‘అది హాస్టల్ అని నాకు తెలీదు. ఆ బిల్డింగ్‌ను ఆనుకొని గోడ ఉంది. గోడ పక్కనే ఉన్న బాత్రూమ్ మీదకు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ మీదకు వెళ్లా. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లా. అక్కడ రెండు డోర్లు కనిపించాయి. వాటిలో కుడిపక్కన డోరు తెరుచుకోలేదు. ఎడమపక్క డోరు తెరుచుకుంది. హాల్లోకి వెళ్లగా.. అక్కడ చాలా బెడ్స్ కనిపించాయి. వాటిలో ఒక పక్కన కిచెన్ ఉంది. అందులో ఇద్దరు అమ్మాయిలు పడుకుని ఉన్నారు.
హాల్లో ఒకే అమ్మాయి నిద్రపోవడం కనిపించింది. ఆమెను ఏమైనా చేస్తే.. అరుస్తుందని భావించా. ఆమెను చంపి నాకు కావల్సింది చేయాలని అనుకున్నా. చంపేందుకు ఆయుధం కోసం వెతికాను. వచ్చిన దారిలోనే మళ్లీ వెనక్కి వెళ్లాను పక్క బిల్డింగులో రోకలి రోకలి బండ కనిపించింది. దాన్ని పట్టుకుని హాల్‌లోకి వెళ్లా. పడుకున్న అమ్మాయిని రోకలి బండతో తలపై కొట్టా. నెమ్మదిగా మూలిగి, ఆ తర్వాత మళ్లీ కదల్లేదు.
దీంతో ఆమెను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి, ఎడమ కాలిని ట్యాప్ కట్టేసి అత్యాచారం చేశా. ఎవరికీ అనుమానం రాకుండా లెటర్ రాసి అక్కడ వదిలా. శరీరంపై 143, లవ్ సింబల్ వేసి బయటకు వచ్చేశా. అప్పటికి సుమారు 4.30 నుంచి 5 గంటలు అవుతోంది. ఆ బిల్డింగు దగ్గర్లోని టీ స్టాల్‌లో ఉదయం 11 గంటల వరకు ఉండి మా ఊరు వెళ్లిపోయా’’ అని పోలీసులకు చెప్పాడు.
అన్ని ఆధారాలు సరిపోయాయి, కానీ..
పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అతడి డీఎన్ఏ శాంపిళ్లు సేకరించి ల్యాబ్ పంపారు. అతడు ఆమెను కొట్టడానికి ఉపయోగించిన రోకలి బండ కోసం వెతికారు. హాస్టల్ బిల్డింగ్ పక్కన ఉన్న పొదల్లో తనిఖీ చేస్తే రోకలి బండ దొరికింది. మెడికల్ రిపోర్టులో కూడా ఆమె తలకు బలమైన దెబ్బ తగలడం వల్లే చనిపోయినట్లు ఉంది. ఆరోజు కారిడార్‌లో ఓ అమ్మాయిని చూశానని సత్యం చెప్పడం నిజమేనని తేలింది.
అలాగే, టీస్టాల్ యజమానిని ప్రశ్నించగా.. అతడు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు తన టీస్టాల్‌లోనే ఉన్నాడని, అంతా ఐదు, పది నిమిషాలు కూర్కొని వెళ్లిపోతుంటే.. అతడు మాత్రం చాలాసేపు టీవీ చూస్తు ఉన్నాడని, అందుకే అతడు తనకి గుర్తు ఉన్నాడని తెలిపాడు. హాస్టల్‌లో ఉన్న మిగతా అమ్మాయిలు క్రిస్టమస్ సెలవులకు వెళ్లారని, అందుకే ఆమె మాత్రమే హాల్లో ఉందని తోటి హౌస్ మేట్స్ చెప్పారు.
చివరికి అతడి అతడి ఫుట్ ప్రింట్, డీఎన్ఏ కూడా మ్యాచ్ కావడంతో 2010న అతడిని విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో సత్యం బాబు పోలీసులకు షాకిచ్చాడు. నిజమైన దోషులను రక్షించేందుకు తనపై నేరం మోపుతున్నారని తెలిపాడు. అయితే, పోలీసులు ఇచ్చిన ఆధారాన్నీ సరిగా ఉండటంతో కోర్టు అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి సత్యం బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు.
చంపింది సత్యం బాబు కాదు.. ఆ మాజీ మంత్రి బంధువే - ఆయేషా తల్లి ఆరోపణ
ఇక హంతకుడు దొరికిపోయాడని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సందర్భంలో ఆయేషా తల్లి చేసిన ఆరోపణలు మరిన్ని అనుమానాలకు దారితీసింది. పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథలా ఉందని, వారి మాటలపై నమ్మకం లేక తాను స్వయంగా విచారణ జరిపితే అసలు విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఆయేషా ఉంటున్న హాస్టల్ మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ బినామీది అని పేర్కొన్నారు.
ఆ హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండేవని, వాటితో సతీష్, అతని స్నేహితులకు సంబంధం ఉందన్నారు. హత్య జరిగిన రోజు గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్టీ జరిగిందని, ఆ రోజు ఆయేషా 9 గంటలకే నిద్రపోయిందని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో పార్టీకి హాజరైన వ్యక్తులు హాస్టల్ తలుపులు కొట్టారని, దీంతో ఆయేషా వారిపై ఫిర్యాదు చేస్తానని తెలిపిందని పేర్కొన్నారు.
దీంతో ఆమె తలను కిటికీ డోరుకు కొట్టి, తలగడతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఆరోపించారు. ఉదయం ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఆయేశా మృతదేహాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు చూడనివ్వలేదని తెలిపారు. నిందితుడు మంత్రి బంధువు కావడం వల్ల తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆమె ఆరోపించారు.
ఈ కేసు మీద ఎక్కువ ఫోకస్ పెడితే నీ చిన్న కూతురికి కూడా ఇదే గతి పడుతుందంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. దీనిపై తాను డీసీపీకి ఫిర్యాదు చేశానన్నారు. రాజకీయ పలుకుబడి అసలైన నిందితులు తప్పించుకుంటున్నారు అని తెలిపారు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారని కోర్టు అడిగితే.. తనకు ఓ వ్యక్తి చెప్పారని, అతని గురించి బయటకు చెప్పవద్దని చెప్పాడని తెలిపారు.
సత్యంబాబు.. నిర్దోషిగా విడుదల
సత్యం బాబు తల్లి సత్యం బాబు వాళ్ల అమ్మ తన కొడుకుకు విధించిన శిక్షపై ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. సత్యంబాబు కేసు వాధించిన లాయర్ విచారణలో అనుమానాలు వ్యక్తం చేశారు. సత్యంబాబును బెదిరించి అలా చెప్పించారని తెలిపారు. ‘‘రోకలి బండతో కొట్టారని పోలీసులు అన్నారు. కానీ, రక్తపు మరకలు లేవు. అది ఫేక్ ఆధారం’’ అని తెలిపారు. దీనికి పోలీసులు సమాధానం ఇస్తూ.. ‘‘హత్య జరిగిన 8 నెలల తర్వాత ఆయుధాన్ని సేకరించాం. అది ఎండలో ఎండి, వానలో తడిచి ఉంటుంది. దానిపై రక్తపు మరకులు ఎలా ఉంటాయి?’’ అని అన్నారు.
‘‘హత్య తర్వాత సత్యంబాబు టీ స్టాల్‌లో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్నాడని అన్నారు. హత్య చేసిన తర్వాత ఒక్క రక్తం మరక కూడా అతని దుస్తులకు అంటుకోలేదా? వాటిని టీస్టాల్ యజమాని గుర్తించలేదా? అంతలోనే అతడు శుభ్రం చేసుకుని వచ్చి టీ స్టాల్‌లో కూర్చున్నాడా?. పోలీసులు అన్నీ అసత్య ఆధారాలు, సాక్ష్యాలు సృష్టించారు’’ అని ఆరోపించారు.
‘‘డీఎన్ఏ, ఫుట్ ప్రింట్స్ మ్యా్చ్ అన్నారు. మానభంగం జరిగిందనడానికి ఆధారాలేమిటీ? బ్యాగ్స్ కింద పడేశాడని, ఆమెను ఈడ్జుకుంటూ వెళ్లాడని అన్నారు. అప్పుడు చిన్న శబ్దం కూడా రాలేదా? ఆ కిచెన్‌కు డోరే లేదు. ఇదంతా జరుగుతున్నా వారికి ఏమీ తెలియలేదా?’’ అని లాయర్ వాదించారు.
దీంతో హైకోర్టు సత్యం హత్య చేయాలేదని అనిపిస్తోందంటూ అతడిని నిర్దోషిగా వదిలి పెట్టాలని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు సత్యంబాబుకు రూ.లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. దీంతో సత్యం 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ సమయంలో ఆయన విజయవాడలో లేరు..
తాము సేకరించిన ఆధారాలన్నీ నిజమైనవేనని పోలీసులు స్పష్టం చేశారు. ఆయేషా తల్లి కోనేరు సతీష్ హత్మ చేశాడని ఆరోపించారని, ఆయన ఆ సమయంలో హైదరాబాదులో ఉన్నట్లు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ టికెట్ చూపించారని తెలిపారు. ఎవరినైనా ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయగలమని, హత్య చేసింది సత్యం బాబేనని, తాము సుప్రీం కోర్టు ఇది నిరూపిస్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
అయితే, ఆధారాలు నాశనం కావడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఆయేషా మీరా మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అంతుచిక్కని ఈ మిస్టరీ కేసు భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.