గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (23:26 IST)

రమణన్న ఓడిపోయినా కేబినెట్‌లో మంత్రిగా చోటిచ్చాను : వైఎస్ జగన్

jagan
వైకాపాకు మాజీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రమణన్న ఓడిపోయినా ఆయనకు తన మంత్రివర్గంలో మంత్రిగా చోటిచ్చి గౌరవించాను అని వెల్లడించారు. 
 
మనం 151 స్థానాలను గెలిచినపుడు రమణన్న గెలవలేదు. ఓడిపోయి 24 స్థానాల్లో రమణన్న పోటీ చేసిన స్థానం కూడా ఉంది. అయినా కూడా నేను రమణన్నను మర్చిపోలేదు. ఎమ్మెల్సీలు రద్దు చేయాలనుకున్నపుడు మళ్లీ వీళ్ల పదవులు పోతాయేమోనని రాజ్యసభకు పంపించాం. అందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆయన ఇపుడు అడిగినా మళ్లీ రాజ్యసభకు పంపించేవాణ్ణి. 
 
తొలిసారి మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపించింది వైకాపా పాలనలోనే. మోపిదేవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఎక్కడా ఆయనను తక్కువ చేసింది లేదు. ఆయన పదవీకాలం ముగిసినా, మళ్లీ రీ నామినేట్ చేయాల్సి వస్తే తప్పకుండా చేసి ఉండేవాళ్లం. మనం ఎక్కడా తప్పు చేయలేదు. మంచిది ఎపుడూ దేవుడు సాయం చేస్తాడు. మంచి చేసే మనసు ఉన్నపుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడతాడు అంటూ జగన్ పార్టీ శ్రేణులతో సమావేశంలో వివరించారు.