గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (12:42 IST)

తిరుమల లడ్డూ కల్తీ వివాదం : స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

turupati laddu
పవిత్ర శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కల్తీ లడ్డూ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోమారు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గగాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కల్తీ వ్యవహారంలో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్ తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. 
 
సిట్ దర్యాప్తు కొనసాగేలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అనే విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుశార్ మెహతా అభిప్రాయం కోరిన విషయం తెల్సిందే. దీంతో సొలిటర్ జనరల్ సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవని కోర్టుకు తెలిపారు. అయితే, సిట్‌పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా అన్నారు. దీంతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.