సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (13:07 IST)

జగన్‌ను దగ్గరకు చేరనివ్వని అమిత్ షా... మూడోసారి రద్దు

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర హో మంత్రి అమిత్ షాక దగ్గరకు చేరనివ్వడం లేదు. ఫలితంగా జగన్‌కు అమిత్ షా మూడోసారి ఇచ్చిన అపాయింట్మెంట్‌ను రద్దు చేశారు. ఈ మేరకు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్‌కు సమాచారం అందింది. 
 
ఈ నెలాఖరులో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే ఆయన అపాయింట్మెంట్ రద్దు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. 
 
అయితే, ఇటీవలికాలంలో అమిత్, జగన్‌ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. ఇక అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి శనివారం ఢిల్లీకి వెళ్లి పలు అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించాల్సి వుంది. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీని కలిసిన జగన్, హోమ్ మంత్రిని మాత్రం కలవలేకపోయారు. ఇపుడు మరోమారు వారిద్దరి భేటీ వాయిదాపడింది.