శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (15:44 IST)

సీఎం జగన్ మరో వరం : డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరో వరాన్ని ప్రకటించారు. కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెలకు రూ.10 వేల ఆర్థిక వేల సాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఆయన గురువారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ, త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 
 
వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పలాస, మర్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారనీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తామన్నారు. డిసెంబర్‌లో ప్రజలందరికీ కొత్త ఆరోగ్యకార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కొత్త కార్డుల్లో మొత్త రెండు వేల వ్యాధులను చేరుస్తామన్నారు. అలాగే, వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. 
 
వచ్చే యేడాది జనవరి 1 నుంచి డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్‌ ఇస్తాం. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. నేను అనంతపురం జిల్లా మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు. మీ జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నాను అని సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.