సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:33 IST)

0.5 శాతం అదనపు రుణ సేకరణకు ఏపీని అనుమతించండి

రాష్ట్ర విభజన నాటి నుంచి తీవ్ర రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఆయన ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యధిక వృద్ధి రేటు సాధించడానికి ప్రతి రాష్ట్రం తపన పడుతుంది. క్రియాశీలుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుంజలో నిలిపేందుకు కృషి చేస్తోందని ఆయన  అన్నారు. 
 
 
అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తీరని అన్యాయం కారణంగా రెవెన్యూ వనరులన్నీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయాయి. అశాస్త్రీయంగా జరిగిన విభజన వలన అంధ్రప్రదేశ్‌ ఇప్పటికీ భారీ రెవెన్యూ లోటుతో సతమతమవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్థిక సంఘం కూడా స్పష్టం చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు.
రెవెన్యూ లోటు కారణంగా అనేక ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతున్నా, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందకపోయినా ముఖ్యమంత్రి నవరత్నాల ద్వారా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం 
 
 
తొలి ఆరు మాసాలలో 45 శాతం మూలధన వ్యయం చేసిన ఏడు రాష్ట్రాలకు  జీఎస్డీపీలో అదనంగా 0.5 శాతం రుణం సేకరించుకోవడానికి ఆర్థిక మంత్రి అనుమతించారు. మూలధన వ్యయం అనే నిబంధన విధించడం ద్వారా విభజననాటి నుంచి రెవెన్యూ లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోమారు అన్యాయం చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించి, పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరుపుతామనంటూ ఇటీవల ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.
 
 
ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని జీఎస్డీపీలో 0.5 శాతం అదనంగా రుణ సేకరణకు రాష్ట్రాన్ని అనుమతించాలని ఆయన ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలు చేయడానికి దోహదం చేసినట్లవుతుందని అన్నారు.