శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (19:55 IST)

ఆర్ధిక సంఘం నిధుల‌పై కేంద్రం సీరియ‌స్ ... పంచాయ‌తీల‌కు ప్ర‌త్యేక ఖాతాలు!

గ్రామ పంచాయ‌తీల నిధుల మ‌ళ్ళింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కొద్దిసేపటి క్రితం కేంద్రం చెక్‌ పెట్టింది. ఇప్పటికే 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట రూ.1,300 కోట్లను ప్రభుత్వం మళ్లించుకుంది.


మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకుంది. దీంతో ఈ వరుసగా నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పులు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం చాలా సీరియస్‌గా స్పందించింది.
 
 
ఈ సందర్భంగా ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో అలెర్టయిన పంచాయతీ రాజ్‌ కమీషనర్‌, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్‌ బ్యాంక్‌లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపై అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
 
 
పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయని, ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసుకోగా, రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జి నిధులను పంచాయతీలకు జమచేయకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోంది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ ప్రమేయం, పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు జమచేసుకొంటోందని సర్పంచ్‌లు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఆర్థిక వనరులు పెరగడానికి ప్రతేక నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చే నిధులను బకాయిలకు జమచేసుకొంటూ, తమ చేతులు కట్టేసిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు.
 
 
ప్రభుత్వం స్థానిక సంస్థలపై పెత్తనం చేస్తోందని గ్రామ అవసరాలు, అభివృద్ధి, ఆర్థిక వనరులు ఇతర అంశాలను సర్పంచ్‌లు, పాలకవర్గం చర్చించి నిధులు ఖర్చుచేయాలని ఏపీ పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌ చెప్పుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం బకాయిల పేరుతో జమ చేసుకోవటం సరికాదని, దీనిపై సర్పంచ్‌లతో చర్చించి కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్రంకు ఫిర్యాదులు రావడంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.