గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (17:08 IST)

ఉచిత రేషన్‌ సరఫరా నాలుగు నెల‌లు పొడిగించిన కేంద్రం

వ‌ర‌ద‌లు, ఇత‌ర ప్ర‌కృతి వైప‌రీత్యాలు ప్ర‌జ‌ల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న త‌రుణంలో కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్నిమరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.


ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. దీంతో ఈ పథకం 2022 మార్చి వరకు అమలు కానుంది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తూ వస్తోంది.
 
 
దేశంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరుణంలో నవంబర్‌ 30 తర్వాత ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని నవంబర్‌ 5న కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవల వెల్లడించిన తెలిసిందే. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్‌ పథకాన్ని మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.