గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (12:54 IST)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నాలుగు రాయలసీమ జిల్లాలలోపాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింద‌ని వైఎస్సార్సీపీ ఎంపీ  వి.విజయసాయి రెడ్డి తెలిపారు. 44 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, మరో 16 మంది ఆచూకీ దొరకలేదని వివ‌రించారు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల అంశాన్ని విజయసాయి రెడ్డి రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తారు. తక్షణ సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 16 నుంచి 18 మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయ‌ని చెప్పారు. వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింద‌ని, ఇళ్ళు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యార‌ని వివ‌రించారు.  రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయ‌ని, వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయ‌ని తెలిపారు. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయింద‌ని, సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు తుడుచుపెట్టుకుని పోయాయ‌ని ఎంపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
 
ప్రాధమిక అంచనాల ప్రకారం 6,054 కోట్ల రూపాయల పంట, ఆస్తి నష్టం జరిగిందని విజయసాయి రెడ్డి వివరించారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టింద‌ని చెప్పారు. వరదలతో అతలాకుతలమైపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించిందని వివ‌రించారు. ఈ విపత్కర పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం అర్ధిస్తోంద‌ని, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి వేయి కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.