శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (16:13 IST)

జగన్ నిర్ణయాలతో పచ్చదండుకు కంటిమీద కునుకులేదు : విజయసాయి రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చదండుకు కంటిమీద కునుకులేకుండా పోయిందనీ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. పైగా, 350 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడుపు మంట స్టార్ట్ అయిందంటూ ఆరోపించారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విజయసాయి రెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "బస్సుల టెండర్లపై 9 సంస్థలు ముందు కొచ్చాయని ఆర్టీసి చెప్పింది. అక్టోబరు 14న టెక్నికల్, నవంబరు 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సి ఉంది. అప్పుడే 7500 కోట్ల క్విడ్ ప్రో కో జరిగిందని కల వచ్చిందట. ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చ దండుకు కంటిమీద కునుకు లేదు. 
 
సంస్థను దివాలా తీయించి జీతాలు చెల్లించలేని దుస్థితికి నెట్టిన వారు ఉచిత సలహాలిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల లీజు ప్రక్రియపైన, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారని ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎంతగా దిగజారి పోయారు చంద్రబాబుగారు. వలంటీర్ల పేరు వింటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు. అతడినేమో దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మంది పిల్లలపై నిందలు వేస్తారా?" అని విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.