శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (18:59 IST)

సైకిల్ తుప్పు పట్టిపోయింది.. ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనం ఇవ్వాలి : పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, వైకాపాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ... రాజకీయం రెండు కుటుంబాలకేనా, సామాన్యులకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. 
 
శాసన సభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా..? అని ప్రశ్నించిన జనసేనాని... సైకిల్ పాతబడి పోయింది.. తెలంగాణ సీఎం కేసీఆర్ సైకిల్ చైన్ తెంపాడు.. ఇక ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనం ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చంద్రబాబు, జగన్‌ను సైతం మనకే ఓటు వేయాలని కోరుతున్నానన్న పవన్... వైసీపీ అంటే టీడీపీకి భయం.. వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేన పార్టీయే కరెక్ట్ అన్నారు. జగన్.. అమిత్‌షా పార్టనర్, బీజేపీ పార్టనర్ కేసీఆర్ అని ఆరోపించారు. ఇక నేను టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగగా పెట్టుకుంటానని స్పష్టం చేసిన జనసేనాని.. జగన్ లాగా దొడ్డిదారిన పోయి ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోనని ఎద్దేవా చేశారు. 
 
గోదావరి జిల్లాలను మించి అనంతపురం జిల్లా ఎదగాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే, రాయలసీమలో వలసలను నివారిస్తామని, అందుకుగాను సౌభాగ్య రాయలసీమ పథకం ప్రారంభిస్తామని, ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, ఇల్లులేని ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు కట్టించి ఇస్తామని, సొంత మగ్గాలు లేని వారికి మగ్గాలు అందజేస్తామని, యువ రైతులను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. 
 
రాయలసీమ అభివృద్ధి కోసం తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటానని, పరిశ్రమలు తీసుకొస్తానని, మండలానికో వృద్ధుల ఆదరణ నిలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తాను సీఎం అయితే, అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని పవన్ పేర్కొన్నారు.