టీడీపీ మా గుండెలపై తన్నింది - పవన్ కళ్యాణ్
చంద్రబాబుకి పాలనా అనుభవం ఉంది. మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అంశాలు రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడతాయని ఆలోచించి 2014లో టీడీపీ, బీజేపీలకి మద్దతు ఇచ్చాం. ప్రత్యేక హోదా ఇచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని భావించాం. టాక్స్ మినహాయింపు ఉంటుంది కాబట్టి భారీ పరిశ్రమలు వస్తాయి, గుంటూరు లాంటి జిల్లాల్లో జిల్లాకి నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మాం. అలా అని గుడ్డిగా నమ్మలేదు ఇచ్చిన మాట తప్పితే బయటికి వచ్చి పోరాటం చేస్తానని ముందే హెచ్చరించాం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో చెప్పారు.
అనుభవం లంచగొండితనంగా మారినప్పుడు పోట్లాడాం. పరిపాలనానుభవం రాష్ట్ర అభివృద్దికి తోడ్పడనప్పుడు తగువు పెట్టుకున్నాం. వ్యవస్థ దెబ్బతింటున్నప్పుడు గొడవపడ్డాం. మేం టీడీపీని ఉదారంగా గుండెలకి ఎత్తుకుంటే వాళ్లేమో మా గుండెల మీద తన్నారు. గుంటూరు జిల్లాలో జన సైనికుడు ఫయాజ్ జెండాని పచ్చబొట్టు వేయించుకుంటే బూట్లతో తొక్కిస్తారా.
టీడీపీ నాయకులకి జన సైనికులు, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం తెలుసా.? రాష్ట్రానికి మీరు బలమైన దశ, దిశ ఇస్తారని ఆశిస్తే మీరు తీసుకువెళ్లిన విధానం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఏలూరులో నేను బస చేసిన ప్రాంగణంమీదే గూండాలతో దాడులు చేయించారు. టీడీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నా.
ఇది నాకు మొదటి ఎన్నిక కాదు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో తిరిగా, 2019లో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం. కుర్రాళ్లు తప్ప ఎవరూ రారన్నారు. 140 మంది అభ్యర్థుల్ని జనసేన తరఫున బరిలోకి దించాం. మిగిలినవి వామపక్షాలకి ఇచ్చాం. పత్తిపాడు ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి. ఓవైపు టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు బరిలో ఉన్నారు, జనసేన తరపున శ్రీ రావెల కిషోర్ బాబు బరిలో ఉన్నారు. ఆలోచించండి నాయకుడి మీద కేసులు ఉంటే ఎప్పుడు జైలుకి పోతారో తెలియదు.
ముఖ్యమంత్రి పదవి మీద తప్ప ప్రజా సమస్యల మీద ధ్యాస లేదు. పత్తిపాడుకి నీరు రాకపోతే ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున పోరాడాలి గానీ, ముఖ్యమంత్రి అయ్యాక చేస్తా అనడం ఏంటి.? టీడీపీకి వైసీపీని ఎదుర్కొనే సత్తా లేదు. ముఖ్యమంత్రి గారు 2014లో గెలవగానే 2019లో గెలవడం ఎలా అనే అంశం మీదే దృష్టి పెడతారు. జనసేన మాత్రమే బలంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. తాడికొండ నుంచి మిత్రపక్షం బీఎస్పీ నుంచి శ్రీ రవికిరణ్ బరిలో ఉన్నారు. జనసేన శ్రేణులంతా ఆయనకి అండగా నిలవాలి" అని కోరారు.