శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (16:57 IST)

రైతులకు పసుపు కుంకుమ పథకమట.. ఏప్రిల్ 9న పోలింగట... లోకేశ్ టంగ్ స్లిప్

తెలుగుదేశం పార్టీకి చెందిన మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ తన అవగాహనాలేమిని మరోమారు బయటపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. కానీ, ఈయన మాత్రం ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతేనా, తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతుల కోసం పసుపు కుంకుమ పథకం ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. 
 
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. లోకేష్‌ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా మందసం మండలంలోని విల్లుపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నోరు జారిన లోకేశ్ పసుపు-కుంకుమ పథకం కింద ప్రతీ రైతు కుటుంబానికి రూ.15 వేలను సీఎం చంద్రబాబు ఇస్తున్నారని నోరు జారారు. ఏపీలోని ప్రతీ మహిళకు పసుపు-కుంకుమ పథకం కింద ఇచ్చే నగదును రైతులకు ఇస్తున్నాం అంటు లోకేశ్ మాట జారారు. 
 
పసుపు-కుంకుమ అందించినా గెలిపిస్తామా లేదా? పసుపు-కుంకమలు చెరిపేసిన వ్యక్తిని గెలిస్తామా? అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు ఆలోచించి ఎన్నికల్లో ఓట్లు వేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే 120 సంక్షేమ పథాకాలను అమలు చేసే ఘనత మన సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారీ రాష్ట్రం అభివృద్ధిని కోరుకునే ప్రతీ ఒక్కరూ మరోసారి చంద్రన్నకు ఓటేసి గెలిపించాలని మంత్రి లోకేశ్ హరిపురం ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు.